బాన్సువాడలో నకిలీ డాక్టర్‌ కలకలం | Fake Doctor Runs Clinic In Nizamabad | Sakshi
Sakshi News home page

బాన్సువాడలో నకిలీ డాక్టర్‌ కలకలం

Published Sat, Mar 7 2020 10:42 AM | Last Updated on Sat, Mar 7 2020 10:42 AM

Fake Doctor Runs Clinic In Nizamabad - Sakshi

శ్రీకాంత్‌రెడ్డి హాస్పిటల్‌  నిర్వహించిన భవనం, నకిలీ వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డి  

సాక్షి, బాన్సువాడ టౌన్‌: బాన్సువాడలోని ఎన్‌జీవోస్‌ కాలనీలో నకిలీ వైద్యుడు ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతుండగా ఎంబీబీఎస్‌ డాక్టర్లు పట్టుకుని, ఎంఐవోకు ఫిర్యాదు చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. పట్టణంలోని ఎన్‌జీవోస్‌ కాలనీలో మూడేళ్ల కిత్రం సంగారెడ్డికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఎంబీబీఎస్‌ డాక్టర్‌ అంటూ సమన్విత హాస్పిటల్‌ ఏర్పాటు చేశాడు. పట్టణంలో ఉన్న ఎంబీబీఎస్‌ వైద్యులకు శ్రీకాంత్‌రెడ్డి రాసే మందుల చీటిలపై అనుమానం వచ్చింది. ఒక రోగానికి మరో మందు రాస్తున్నారని వారు గమనించారు. దీంతో వైద్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని నకిలీ వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డిని పిలిచారు. ఆయన చదువుకున్న కళాశాల వివరాలు ఆరా తీశారు. దీంతో శ్రీకాంత్‌రెడ్డి ఎంఎన్‌ఆర్‌ కళాశాలలో చదివానని, మరో సారి ఢిల్లీ యూనివర్సిటీలో చదివానని తడబడుతు సమాధానం చెప్పారు.

తన వద్ద ఉన్న సర్టిఫికేట్‌ను వైద్యులు ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేయగా నకిలీ అని తేలింది. దీంతో వారు శ్రీకాంత్‌రెడ్డిని నిలదీయగా తాను కొంపల్లిలో ఓ ఆస్పత్రిలో పని చేశానని, బోధన్‌కు చెందిన సాయిబాబా తనను బాన్సువాడకు తీసుకువచ్చాడని చెప్పారు. గతంలో ఇక్కడ ఉన్న వైద్యుల వద్ద హాస్పిటల్‌ను రూ.8.50 లక్షలకు కొనుగోలు చేశామని కొన్ని రోజుల తర్వాత సాయిబాబా మోసం చేయడంతో ఒక్కడినే హాస్పిటల్‌ నడిపిస్తున్నానని చెప్పారు. దీంతో వైద్యులు నిజామాబాద్‌లో ఉన్న ఐఎంవోకు ఫిర్యాదు చేయగా, వారు కామారెడ్డిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ వైద్యుడు శ్రీకాంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తారని తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి హాస్పిటల్‌కు తాళం వేసి పరారయ్యాడు. ఆయనకు సంబంధించిన హాస్పిటల్‌ బోధన్‌లో కూడా ఉన్నట్లు తెలిసింది. 

వేరే మందులు రాస్తుండటంతో.. 
రోగం ఒకటి ఉంటూ వేరే మందులు రాస్తుండటంతో శ్రీకాంత్‌రెడ్డిపై అనుమానం వచ్చింది. వైద్యులందరం కలిసి ఆయనను పిలిచి సర్టిఫికెట్ల గురించి ఆరా తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఐఎంవోకు ఫిర్యాదు చేశాం.   
– కిరణ్‌కుమార్, పిల్లల వైద్య నిపుణుడు, బాన్సువాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement