
పట్నా: వైద్యుడని ప్రజలను నమ్మిస్తూ ప్రైవేట్ నర్సింగ్ హోం నడిపిస్తున్న ఓ ఫేక్ డాక్టర్ భాగోతం బయటపడింది. సదరు వ్యక్తి నవజాత శిశువును విక్రయిస్తూ పోలీసులకు చిక్కడంతో ఈ చీకటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బిహార్‌లోని మధేపుర జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబా విష్ణు రౌత్ హాస్పిటల్ పేరుతో నిందితుడు ఆర్‌కే రవి రిజిష్టర్ కూడా చేయకుండా నర్సింగ్ హోంను గత కొంత కాలంగా నడుపుతున్నాడు. అంతేగాక అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా వైద్యం పరంగా ఎటువంటి శిక్షణలు తీసుకోకుండానే రోగులకు వైద్యం చేస్తున్నారు.
దీంతో అక్కడ జరుగుతున్న అవకతవకలపై పోలీసులకు సమాచారం అందింది. మాధేపుర జిల్లా మేజిస్ట్రేట్ శ్యామ్ బిహారీ మీనా ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఉదకిషుగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాజీవ్ రంజన్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. నర్సింగ్ హాంపై అధికారులు దాడి జరుగుతున్న సమయంలో నిందితుడు రవి ఓ నవజాత శిశువును రూ 65,000కు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. శిశువును కాపాడిన అధికారులు మధేపుర సదర్ హాస్పిటల్‌కు తరలించారు. నిందితుడు రవి, ఆస్పత్రి సిబ్బంది నవీన్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా నిందితుడు రవి డాక్టర్‌గా కావాల్సిన నకిలీ సర్టిఫికెట్లను సృష్టించుకుని కొన్నాళ్లుగా వైద్యుడిగా కొనసాగినట్లు తెలిపాడు. శిశువులను తాను రూ 85,000 నుంచి రూ 1.5 లక్షలకు కొందరికి విక్రయించినట్లు వెల్లడించాడు. దవాఖానను సీజ్ చేసిన పోలీసులు రోగులందరినీ సమీప పీహెచ్‌సీకి తరలించారు. అక్రమ రవాణా రాకెట్ గత రెండు సంవత్సరాలుగా నర్సింగ్ హోమ్ నుంచి నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment