నల్లజర్ల రూరల్: నల్లజర్లలో నకిలీ వైద్యుడు జువ్వాల రమేష్‌బాబు లీలలపై వైద్య ఆరోగ్య శాఖ గురువారం విచారణ ప్రారంభించింది. నల్లజర్లలో జువ్వల రమేష్ పేరుతో వైద్యునిగా చలామణి అవుతూ తన వైద్యశాలలో నర్సుగా చేరిన యంట్రపాటి రాజేశ్వరి(21)(అలియాస్)కవితను మాయమాటలతో నమ్మించి, మోసగించడంతో ఆ యువతి మృతి చెందిన విషయం విదితమే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఆరోగ్య విస్తరణాధికారి సీ.హెచ్.నాగేశ్వరావు, తాడేపల్లిగూడెం క్లస్టర్ వైద్యాధికారిణి సుజాత, నల్లజర్ల పీహెచ్‌సీ డాక్టర్ జి.సుధీర్‌కుమార్ ఆధ్వర్యంలో నబీపేట వెళ్లిన ఈ బృందం మృతురాలి తల్లిదండ్రులు సుబ్బారావు, సంతోషంల నుంచి వివరాలు సేకరించారు.
ఏడాదిన్నర క్రితం నుంచి తమ కుమార్తె నర్సుగా అక్కడ పని చేస్తోందని ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి పేరుతో వైద్యుడు రమేష్ బాబు మోసం చేశారని రాజేశ్వరి తల్లితండ్రులు అధికారులకు వివరించారు. రెండుసార్లు గర్భస్రావం చేయించి నట్టు తమకు చెప్పిందని తమ కుమార్తెను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గర్భస్రావం వికటించడం వల్లే తమ కుమార్తె మృతి చెందినట్టు చెప్పారు. దీనిపై డీఈఎంవో నాగేశ్వరావు మాట్లాడుతూ క్లస్టర్ వైద్యాధికారిణి సుజాత ప్రాథమిక విచారణ చేశారని, అనంతర విచారణకు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి తనను నియమించినట్టు చెప్పారు. జువ్వలరమేష్ క్యాలిఫైడ్ డాక్టరు కాదని తమ విచారణలో తేలిందన్నారు. ఆసుపత్రి నిర్వహించడానికి గాని అక్కడ వైద్యం చేయడానికి గాని అతనికి ఎటువంటి అనుమతి లేదన్నారు.
రమేష్‌బాబుపై క్రిమినల్ కేసు నమోదు పెడుతున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 282 ఆసుపత్రులకు,174 ల్యాబ్‌లకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. 16 క్లస్టర్ల పరిధిలో ఉన్న అడిషనల్ డీఎంహెచ్‌వోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారన్నారు. అనధికార ఆసుపత్రుల నిర్వహణపై సర్వే జరిపిస్తున్నామన్నారు. పీఎంపీలు, ఆర్‌ఎంపీలు తమ పరిధులు దాటి వైద్యం చేయరాదన్నారు. అనంతరం వైబీ ఆసుపత్రిని పరిశీలించగా అనధికారికంగా మందులు విక్రయించడం, ఆపరేషన్లు చేయడం వంటి విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆసుపత్రిని పోలీసులతో సీజ్ చేయించారు. వీరితో పాటు నబీపేట సర్పంచ్ కాశీ, క్లస్టర్ విద్యాధికారి వి.వి.శ్రీరామ్మూర్తి, సూపర్‌వైజర్ సుభాకర్, ఏఎన్‌ఎంలు ఉన్నారు.
మరింత మంది ‘శంకర్‌దాదాలు’
తణుకు : నకిలీ సర్టిఫికెట్లతో ఆసుపత్రి నిర్వహిస్తూ అధికారుల తనిఖీలో బట్టబయలైన తణుకు పట్టణానికి చెందిన నకిలీ డాక్టర్ శ్రీకాంత్ ఉదంతం...
నల్లజర్లకు చెందిన జువ్వాల రమేష్ అనే నకిలీ డాక్టర్ వైబీ ఆసుపత్రి పేరుతో వైద్యం చేస్తున్న వ్యవహారం... ఇలా జిల్లాలో నకిలీ డాక్టర్లు వైద్యవృత్తిలో కొనసాగుతున్న తీరు వైద్య రంగాన్నే విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలో ఈ తరహా వైద్యులు మరింత మంది ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా తణుకు పట్టణానికి చెందిన మరో ప్రైవేటు వైద్యుడు తనకు సర్టిఫికెట్లు లేవంటూ జిల్లా వైద్యాధికారులను ప్రాధేయపడినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వైద్యుడు గత 15 రోజులుగా ఆసుపత్రికి రాకుండా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతోనే శ్రీకాంత్, రమేష్‌లాంటి ‘శంకర్‌దాదాలు’ పుట్టుకొస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆసుపత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తుంటారు.
అయితే ఎప్పుడూ కమిటీలు సమావేశమై చర్చించుకున్న దాఖలాలు లేవు. మరి కొందరు వైద్యులు ఎండీ కోర్సు మధ్యలో నిలిపేసినప్పటికీ ప్రముఖ వైద్యుల జాబితాలోనే కొనసాగుతుండటం విశేషం. కొందరు వైద్యులు తాము చదువుతున్న కోర్సు మధ్యలో నిలిపివేసినా... లేక కోర్సు చదువుతున్నప్పటికీ తమ డిగ్రీలను బ్రాకెట్‌లో పెట్టుకుంటూ ప్రజలను,అధికారులను మభ్యపెడుతున్నారు. అందేంటని ప్రశ్నిస్తే ఇంకా కోర్సు పూర్తి కాలేదు అందుకనే డిగ్రీను బ్రాకెట్‌లో పెట్టానని తణుకు పట్టణానికి చెందిన ఒక వైద్యుడు సమాధానం ఇవ్వడం గమనార్హం.
నకిలీ వైద్యుని లీలలపై విచారణ
Published Fri, May 29 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement