సెక్స్ సమస్యలు పరిష్కరిస్తానంటూ.. | fake doctor arrested in turupathi | Sakshi
Sakshi News home page

సెక్స్ సమస్యలు పరిష్కరిస్తానంటూ..

Published Sun, Jul 10 2016 5:10 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

సెక్స్ సమస్యలు పరిష్కరిస్తానంటూ.. - Sakshi

సెక్స్ సమస్యలు పరిష్కరిస్తానంటూ..

తిరుపతి :
సెక్స్ సమస్యలకు పరిష్కారం చూపెడతానని, ఎంతటి దీర్ఘకాలిక వ్యాధి అయినా చిటికెలో తగ్గిస్తానని నమ్మిస్తూ అమాయకుల నుంచి లక్షలు దండుకుంటున్నాడు ఓ నకిలీ డాక్టర్. పేదవారు, అమాయక మహిళలే లక్ష్యంగా, వారి బలహీనతను పెట్టుబడిగా ఎంచుకున్న ఆ మాయగాణ్ణి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 10వ తరగతి ఫెయిలై, తిరుపతిలో డాక్టర్‌గా చలామణి అవుతున్న వాడికి నగరంలోని పలువురి స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్ల నుంచి మద్దతు, ప్రోత్సాహం ఉండడం గమనార్హం. రోగులకు నకిలీ వైద్యం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్న వైనాన్ని నవసమాజ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపకులు నగేష్, ఓ టీవీ చానల్ రిపోర్టర్ పసిగట్టి పోలీసులకు సమాచారమిచ్చారు.

కోల్‌కతాలోని నిథియాకు చెందిన బి.బినయ్(26) 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఏడాది క్రితం తిరుపతికి వచ్చాడు. అప్పటికే తిరుపతిలో నకిలీ డాక్టర్‌గా చెలామణి అవుతున్న సురేష్‌తో అతనికి పరిచయమైంది. ఒకటిన్నర నెలలో తెలుగు భాషను నేర్చుకున్నాడు. తుడా మార్గం, శ్రీ సాయి దంత వైద్యశాల ఆస్పత్రికి సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. మేఘన క్లినిక్ పేరుతో డాక్టర్ బి.బినయ్‌గా అవతారమెత్తాడు.

నకిలీ డాక్టర్ లీలలు ఎన్నెన్నో...
తాను చదువుకుంది 10వ తరగతి అయినప్పటికీ తలపండిన డాక్టర్‌లా అందరికీ వైద్యం చేసేస్తున్నాడు. దాంపత్య సమస్యలు, మొలలు, లూటీలు, వరిబీజము, గనేరియా, సిప్లిస్ వంటి సమస్యాత్మకమైన వ్యాధులకు తెలిసీ తెలియని వైద్యం చేస్తున్నాడు. పైగా మహిళలకు ఆపరేషన్ లేకుండా మొలలకు ప్రత్యేక చికిత్స చేస్తానంటూ లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఏ జబ్బు వచ్చినా నగరంలో పేరున్న స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లకు పరీక్షలకు పంపుతున్నాడు. ఫలితంగా ఈయనగారికి వేల రూపాయాలు కమీషన్లు ముట్టచెబుతున్నారు. రోగులకు సాధారణ జ్వరమైనా, దీర్ఘకాలిక వ్యాధి అయినా ఒకటి ఎర్ర, పసుపు మాత్రలు మాత్రమే ఇస్తాడు. అదేమని అడిగితే కోల్‌కతా నుంచి ప్రత్యేకంగా తెప్పించామని నమ్మిస్తాడు.

ఎవరైనా దాంపత్య సమస్యలతో వచ్చిన మహిళలకు ‘డే, నైట్ హెర్బల్ మసాజ్ ఆయిల్’ ఇవ్వడంతోపాటు అది ఎలా వాడుకోవాలో స్వయంగా చేసి చూపిస్తూ లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నవ సమాజ వ్యవస్థాపక అధ్యక్షుడు నీరుగట్టు నగేష్, కన్వీనర్ విజయ్‌భాస్కర్ మీడియా సహకారంతో నకిలీ డాక్టర్ విషయాన్ని గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం నకిలీ డాక్టర్‌ను ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా బినయ్‌ను నకిలీ డాక్టర్‌గా మార్చిన మరో నకిలీ డాక్టర్ సురేష్ పరారీలో ఉన్నట్టు తెలిసింది. పైగా సురేష్‌పై 2013లో అలిపిరి పోలీస్టేషన్‌లో కేసు నమోదైనట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement