లబ్బీపేట(విజయవాడతూర్పు): కోవిడ్ సోకిన రోగుల వద్దకు కుటుంబ సభ్యులే వెళ్లేందుకు సాహసించడం లేదు.. వైద్యు లు సైతం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యుప్‌మెంట్ (పీపీఈ) కిట్ ధరించి వెళ్లి వైద్యం చేస్తుంటారు. అలాంటిది ఓ 45 ఏళ్ల మహిళ డాక్టర్ అవతారం ఎత్తి నాలుగు రోజులుగా, ఐసీయూల్లో ఉన్న రోగుల వద్దకు వెళ్లి వస్తుంది. అదేరీతిలో బుధవారం కూడా మెడలో స్టెత్ వేసుకుని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌కు వచ్చింది. అక్కడ స్టోర్‌కు వెళ్లి డాక్టర్ శైలజ అని రిజిస్టర్‌లో రాసి పీపీఈ కిట్ తీసుకుంది. అనంతరం అక్కడే తచ్చాడుతుండగా, కొందరు సిబ్బందికి అనుమానం వచ్చి, మీరు ఎవరని ప్రశ్నించగా, ‘ఐయామ్ డాక్టర్ శైలజ’ అని చెప్పింది. ఏ విభాగంలో పనిచేస్తారని అడగ్గా, ఇక్కడే కోవిడ్ హాస్పటల్‌లో అని చెప్పింది.
ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది పీపీఈ తీసుకుంటే సంతకం పెట్టాలని చెప్పి పక్కనే ఉన్న రూమ్‌లోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ కూర్చోపెట్టి ఐడెంటిటీ కార్డు అడగ్గా, తనవద్ద లేదని ఒకసారి, మా బంధువులు వస్తానంటే వచ్చానని మరోసారి, ఆయుర్వేద వైద్యురాలినని, బంధువులు ఐసీయూలో ఉంటే చూసేందుకు వచ్చానని ఇలా పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఆమెను స్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారించగా ప్రసాదం పాడు అని, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివినట్లు తెలిసింది. డాక్టర్ అవతారం ఎత్తి ఎందుకు వచ్చిందనే విషయం ఇంకా తెలియలేదు. కాగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ ఆస్పత్రి నుంచి రావడంతో, ఆమెకు ఎక్కడ కరోనా సోకిందోనని పోలీసులు సైతం భయపడుతున్నట్లు తెలిసింది.
నాలుగు రోజులుగా ఐసీయూ వార్డులో హల్‌చల్
డాక్టర్ శైలజ పేరుతో సదరు మహిళ నాలుగు రోజులుగా ఐసీయూలో తిరుగుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల కొత్తగా 80 మంది వైద్యులు రావడంతో వారిలో ఒకరై ఉంటారని సిబ్బంది భావించారు. అంతేకాకుండా పీపీఈ వేసుకోవడంతో గుర్తుపట్టలేక పోయినట్టు చెబుతున్నారు. ఇలా తనతో పాటు మరొకరిని తీసుకుని ఐసీయూల్లోకి వెళ్తుందని చెబుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వారి బంధువులను శైలజ డాక్టర్ అవతారంలో తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు.
నకిలీ డాక్టర్ శైలజ, ఆమె భర్త అరెస్ట్
కోవిడ్ ఆస్పత్రిలో హల్‌చల్ చేసిన నకిలీ డాక్టర్ శైలజ, ఆమె భర్త సత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ.. శైలజ, సత్య ఇద్దరు పాత నేరస్తులని, వారిద్దరిపై చీటింగ్ కేసులు ఉన్నాయన్నారు. కరోనా రోగుల బంధువుల దగ్గర డబ్బులు వసూలు చేసేందుకే శైలజ డాక్టర్ అవతారం ఎత్తినట్లు చెప్పారు. భర్త సహకారంతోనే నాలుగు రోజులుగా ఆస్పత్రి సిబ్బందిని మోసం చేస్తోన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment