నకిలీ వైద్యుడి అరెస్ట్
Published Thu, Oct 24 2013 2:33 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM
పిఠాపురం, న్యూస్‌లైన్ : జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో డాక్టరునని నమ్మించి.. పనికిరాని మందులతో రోగులకు వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడిని బుధవారం పిఠాపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ఎస్.రాంబాబు స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం విలేకరులకు కేసు వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన మహమ్మద్ రసూల్ అలియాస్ ఫకీర్ అహ్మద్ (అభిచంద్) ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. నల్లగొండ జిల్లా కోదాడలో ఓ ఆర్‌ఎంపీ వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు. వైద్యంలో కొద్దిగా మెలకువలు నేర్చుకున్న అతను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎ.మల్లవరానికి మకాం మార్చాడు. అక్కడ ఆర్‌ఎంపీ అవతారమెత్తాడు. స్థానికులతో నమ్మకంగాఉంటూ, గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి మొత్తం రూ.70 వేలు వరకు వసూలు చేశాడు.
ఎంతకీ గ్యాస్ కనెక్షన్లు రాక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అతడిని నిలదీశారు. అతడు మోసం చేశాడని తెలుసుకుని వారు అన్నవరం పోలీసులకు గతేడాది డిసెంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో నిందితుడిని అరెస్టు చేసి ప్రత్తిపాడు కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అదే గ్రామంలోని సబ్ జైలులో నాలుగు నెలల పాటు ఉన్నాడు. అతనికి ఎవరూ పూచీకత్తు ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి సెల్ఫ్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో బయటకు వచ్చిన నిందితుడు పిఠాపురం మండలం రాపర్తిలో ఉన్న తన అన్న కూతురి ఇంటికి చేరుకున్నాడు.
అక్కడ జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులో డాక్టరుగా కొత్త అవతారమెత్తాడు. తన పేరు ఎండీ రసూల్ అని, గ్రామా ల్లో రోగులకు సేవలందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా తనను నియమించిందని నకిలీ విజిటింగ్ కార్డు, ఐడెంటిటీ కార్డులు చూపించి అక్కడి రోగులను, స్థాని కులను నమ్మించాడు. సాధారణ మందులనే ఎయిడ్స్‌కు సంబంధించినవని చెబుతూ రోగుల నుంచి అధిక మెత్తంలో డబ్బు గుంజేవాడు. ఇక్కడ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇప్పిస్తానని చెప్పి స్థానికులు ఒకొక్కరి నుంచి రూ.1500 చొప్పున సుమారు రూ.24 వేలు వసూలు చేశాడు.
చివరకు స్థానిక పాస్టర్ కె.వీరబాబు బైక్ దొంగిలించి ఆ గ్రామం నుంచి పరారయ్యాడు. వీరబాబు ఫిర్యాదు మేరకు పిఠాపురం రూరల్ పోలీ సులు కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం సామర్లకోటలో పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నకిలీ విజిటింగ్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, స్టెతస్కోపు, నల్లగొండ జిల్లా కోదాడ గ్రామ పంచాయతీ స్టాంపు, నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. అనేక గ్రామాల్లో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల వివరాలు తెలుసుకుని, వారిని నకిలీ మందులతో మోసం చేసినట్టు సీఐ రాంబాబు తెలిపారు.
Advertisement
Advertisement