నకిలీ డాక్టర్ల ఆటకట్టు | Fake Doctor Clinic Seized in Chittoor | Sakshi
Sakshi News home page

నకిలీ డాక్టర్ల ఆటకట్టు

Published Thu, Jun 11 2020 1:45 PM | Last Updated on Thu, Jun 11 2020 1:45 PM

Fake Doctor Clinic Seized in Chittoor - Sakshi

క్లినిక్‌ బోర్డును తొలగిస్తున్న అధికారులు

పలమనేరు: ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని వైద్యం అందిస్తున్న నకిలీ ఎంబీబీఎస్‌ డాక్టర్ల ఆట కట్టించిన సంఘటన గంగవరం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. నాలుగురోడ్లు గ్రామం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రి సేవలు కావాలంటే సమీపంలోని పత్తికొండ లేదా పలమనేరు ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలోని ప్రజలు అక్షరాస్యత తక్కువగానే ఉంది. దీన్ని గమనించిన కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా ఎల్డూర్‌కు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి తాను ఎంబీబీఎస్‌ డాక్టర్‌నంటూ గ్రామంలో ఆర్‌వీ క్లినిక్‌ పేరిట మూడు నెలల క్రితం హైవేకు ఆకునుని ఆస్పత్రి ఏర్పాటు చేశారు. రోగులు అక్కడికి రావడం మొదలు పెట్టారు.

ఏమైందో కానీ అతను ఉన్నట్టుండి మాయమయ్యాడు. అదే ఆస్పత్రిలో మహేంద్ర అనే కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి తాను ఎంబీబీఎస్‌ డాక్టర్‌నంటూ వైద్యం అందించడం మొదలుపెట్టాడు. అనుభవం, చదువు లేక కనీసం నాడి కూడా తెలియని మహేంద్ర సేవలపై అనుమానం వచ్చిన కొందరు రోగులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గంగవరం మండల వైద్యాధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పత్తికొండ పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ యుగంధర్‌ బుధవారం ఆ క్లినిక్‌ను తనిఖీ చేశారు. డాక్టర్‌గా చెలామణి అవుతున్న మహేంద్ర అసలు డాక్టరే కాదని, అతనికి ఏమాత్రం అనుభవం లేదని తేలింది. క్లినిక్‌లో ల్యాబ్, రోగులకు బెడ్లు, అక్కడే మందులు ఉండడాన్ని చూసి విస్తుపోయారు. క్లినిక్‌ను సీజ్‌ చేసి, అక్కడున్న బోర్డులను తొలగించారు. మహేంద్ర, శివకుమార్‌పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్టు వారు తెలిపారు. ప్రజలు ఇలాంటి వారిని నమ్మకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement