
తివట్టిపట్టి పోలీస్‌స్టేషన్ వద్ద యువతి బంధువులు
సేలం: గర్భం దాల్చిన అవివాహిత విషయం ఇంట్లో తెలియకుండా నకిలీ వైద్యురాలితో అబార్షన్ చేయించుకోవడం ఆమె ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సంఘటన సేలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా ఓమలూరు సమీపం బొమ్మియంపట్టి గ్రామానికి చెందిన పెరుమాల్ కుమార్తె జీవా (19). కళాశాల విద్యార్థిని అయిన ఈమె అవివాహిత. ఇలాఉండగా జీవా ప్రియుడితో చనువుగా మెలగడంతో గర్భం దాల్చింది. ఈ విషయం కుటుంబీకులకు తెలియకుండా పది రోజుల కిందట నడుపట్టిలో నకిలీ డాక్టర్ సుల్తానా వద్దకు వెళ్లి అబార్షన్ చేయించుకుంది. అయితే, గత నెల 28న జీవాకు తీవ్రమైన కడుపునొప్పి ఏర్పడింది. దీంతో ఆమెను సేలం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది.
అనంతరం పరిస్థితి విషమించడంతో జీవాను 29వ తేదీ సేలం జీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 31వ తేదీ జీవా మృతి చెందింది. జీవాకు నకిలీ వైద్యురాలు అందించిన చికిత్స వికటించి మృతి చెందినట్టు సేలం హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వలర్మతికి సమాచారం అందింది. దీంతో ఆదివారం వలర్మతి నడుపట్టిలో ఉన్న డాక్టర్ సుల్తానా ఇంటికి వెళ్లి అకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీలో సుల్తానా నకిలీ వైద్యురాలుగా తేలడంతో ఆమెను అరెస్టు చేయాలని తీవట్టిపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోమవారం సుల్తానాను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ప్రభుత్వ వైద్యులను ఆశ్రయించండి: సేలం హెల్త్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వలర్మతి మీడియాతో మాట్లాడుతూ నకిలీ డాక్టర్ల వద్దకు వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment