గాంధీలో హల్చల్ చేసిన మహిళ అరెస్ట్
హైదరాబాద్ : ప్రేమ... ఎంత పనైనా... ఎలాంటి సాహసమైనా చేయిస్తుందనడానికి... ఏ వేషమైనా వేయిస్తుందనడానికి ఉదాహరణ ఆ మహిళ ఉదంతం. ప్రియుడితో చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ఆడిన నాటకం... ఆమెను చిక్కుల్లో పడేసింది. ఏకంగా జైలు పాలు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి చిలకలగూడ డీఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివీ...సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సోమవారం డాక్టర్ వేషంలో హడావుడి చేసిన మహిళ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆమె ఆ అవతారం ఎత్తడానికి కారణం ‘ప్రేమ’ని పోలీసుల వద్ద వెల్లడించింది. ఆమె పేరు కె.శివాని(33).
మహబూబ్‌నగర్‌లోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన ఆమె స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయాగా పని చేసేది. స్థానికుడైన బాలయ్యతో 2002లో శివానికి వివాహమైంది. ఆరేళ్ల వయసు గల కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల క్రితం భర్త బాలయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుని బంధువుల వద్ద ఉంచి... కొద్ది నెలల క్రితం నగరానికి వలస వచ్చిన ఆమె కర్మాన్‌ఘాట్‌లో గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. తాను గాంధీ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నట్టు అందరికీ చెబుతుండేది.
ఈ క్రమంలో బేగంపేటకు చెందిన ఓ యువకునితో (20) పరిచయం ఏర్పడి... ప్రేమగా మారింది. ప్రియునితో కూడా గాంధీ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తానని చెప్పింది. ఆస్పత్రికి వస్తానని ప్రియుడు అడుగుతుండగా... కొద్ది రోజులుగా దాట వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వైద్యులు వేసుకునే ఏప్రాన్, స్టెత్‌స్కోప్ కొనుగోలు చేసింది. సోమవారం ఉదయం ఓపీ విభాగంలో విధులు నిర్వహిస్తుంటానని... అక్కడికి రమ్మని ప్రియునికి ఫోన్ చేసింది.
అతనితో చెప్పినట్టే అక్కడ వైద్యురాలి వేషంలో హల్చల్ చేస్తుండగా... సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఆప్పగించారు. ప్రియుణ్ణి కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు సంగతి బయటపడింది. గాంధీ ఆస్పత్రి అధికారుల ఫిర్యాదు మేరకు శివానీని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని... ఈ ఘటనలో ప్రియుడి ప్రమేయం లేనట్టు తేలిందని డీఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.
ప్రేమ కోసమై...వేషం మార్చెను!
Published Wed, Jul 8 2015 1:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement