గాంధీ ఆస్పత్రి: ఏకంగా ఆరు నెలలు ఒక వ్యక్తి డాక్టర్ అవతారమెత్తి గాంధీ ఆస్పత్రిలో తిరిగాడు.. అక్కడికి వచ్చిన రోగుల్ని తన క్లీనిక్‌కు ఎంచక్కా తరలించాడు.. ఇంత జరిగినా ఆస్పత్రి పాలనా యంత్రాంగం అతడు నకిలీ వైద్యుడన్న సంగతిని గుర్తించలేకపోయింది.. ఇంతకీ ఎవరీ నకిలీ డాక్టర్.. ఒడిశాకు చెందిన సుబ్రజిత్ పండా (26) నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంఎస్‌సీ మైక్రోబయాలజీ చదువుతున్నాడు. సులభంగా డబ్బుల సంపాదనకు వైద్యుడిగా అవతారం ఎత్తాడు. ఇంజెక్షన్లు వేయడం, బీపీ, సుగర్ చెక్ చేయడం, జలుబు, దగ్గు, జ్వరం వంటి సా«ధారణ రోగాలకు ఏ మందులు ఇవ్వాలో నేర్చుకున్నాడు.
ఉప్పల్, హనుమాన్ సాయినగర్‌లోని గాంధీ విగ్రహం వద్ద తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే కమ్యూనిటీ కార్డియాలజీ పేరిట క్లినిక్‌ను ప్రారంభించాడు. విదేశాల్లో డాక్టర్ కోర్సులు చదివినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకున్నాడు. అయితే.. అనుకున్నంతగా రోగులు రాకపోవడంతో రూటు మార్చి గాంధీ ఆస్పత్రిని అడ్డాగా మార్చుకున్నాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరిట ఎంఎస్ ఫెలోషిప్ ఇన్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జన్‌గా నకిలీ ఐడీకార్డును సృష్టించుకున్నాడు.
ఈ కార్డుతో గాంధీ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో వైద్యుడిగా తిరిగాడు. చికిత్సలో జాప్యం తోపాటు సిబ్బంది కొరతతో ఇక్కడ పట్టించుకోరని చెబుతూ తన క్లినిక్‌కు వస్తే తక్కువ ఖర్చుతో రోగాలను నయం చేస్తానని నమ్మించి రోగులను తన క్లినిక్‌కు తరలించేవాడు. గురువారం క్యాంటీన్‌లో ఉండగా జనరల్ మెడిసిన్ పీజీలు అక్కడకు వచ్చి మీది ఏ డిపార్ట్‌మెంట్ అని పండాను అడిగారు. అనుమానంతో సెక్యూరిటీకి సమాచారమిచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుబ్రజిత్‌పండాపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్టు, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు ప్రకారం కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment