చదివింది ఎలక్ట్రోపతి.. చేసేది అల్లోపతి!
-
నకిలీ వైద్యుడి లీలలు
-
ఊరుకో పేరు.. ఒక్కొక్క చోట ఒక్కో డిగ్రీ
-
ఆరోగ్య మంత్రితో పరిచయం
-
అందుకే పట్టించుకోని వైద్యాధికారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
డాక్టర్ వేమూరి రాధాకృష్ణ చౌదరి.. డాక్టర్ కృష్ణ చౌదరి.. డాక్టర్ చౌదరి.. ఆయన అసలు పేరు ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు గానీ.. ఒక్కో చోట ఒక్కో పేరుతో ఆసుపత్రి తెరుస్తుంటారు. ప్రతిచోట అతని పేరు పక్కన ఉండే డిగ్రీ, రిజిస్టర్ నంబర్ మారుతుంటాయి. తన నకిలీ బాగోతం బయటపడగానే మరో పేరుతో మరో చోట ఆసుపత్రి తెరుచుకుంటుంది. జిల్లాలో ఒక నకిలీ వైద్యుడు సాగిస్తున్న భాగోతమిది. ప్రతిచోల ఆసుపత్రి ప్రారంభానికి ప్రముఖులను పిలుస్తుండటంతో అధికారులు కూడా అతని జోలికి వెళ్లడం లేదు. తాజాగా పాలకొల్లులో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పిలవడంతో ఆయన పలుకుబడి అర్థమై వైద్యశాఖ అధికారులు ఆతని జోలికి వెళ్లడం లేదు. అతను పూర్తిగా నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతనిపై ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదులు అందినా ఇప్పటివరకూ స్పందించిన దాఖలాలు లేవు.
నకి’లీలలు’ ఇలా..
ఆయన తాళ్లపూడి, ఆచంట, తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆసుపత్రులు నిర్వహించినపుడు ఎండీ జనరల్ మెడిసిన్‌గా ప్రచారం చేసుకున్నారు. ఇతడు ఎలక్ట్రోపతి (విద్యుత్ ఆధారిత వైద్యం) చదివినట్టు వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాళ్లపూడిలో తాను ఏర్పాటు చేసిన ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్, మందుల షాపు ఇప్పిస్తానని కొందరి నుంచి సొమ్ములు తీసుకుని మోసం చేయడంతో బాధితులు అతనిపై ఫిర్యాదు చేశారు. తాజాగా పాలకొల్లులో ఎండీ ఆల్టర్నేటివ్ మెడిసిన్‌గా చెప్పుకుంటూ ఆసుపత్రి తెరిచారు. అయితే ఆయన చేస్తున్నదంతా అల్లోపతి (ఇంగ్లిష్) వైద్యం కావడం గమనార్హం. ప్రతిచోట ఆసుపత్రి పెట్టినప్పుడు తనతోపాటు ఒక ఎంబీబీఎస్ చదివిన వైద్యుడి పేరును చేర్చుకుని ఈ దందా నడుపుతున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే ఎంబీబీఎస్ డాక్టర్‌ను చూపిస్తున్నట్టు సమాచారం. అతని సర్టిఫికెట్లు అన్నీ బోగస్ అనే ప్రచారం ఉంది. ఒక్కోచోట ఒక్కో రిజిస్టర్ నంబర్‌తో చలామణి అవుతున్నారు.
ఒకచోట డాక్టర్ చౌదరి పేరుతో.. మరోచోట రాధాకృష్ణచౌదరి, ఇంకోచోట కృష్ణ చౌదరి పేరుతో ఆసుపత్రులు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. పాలకొల్లులో డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి పేరితో సంపూర్ణ ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభించారు. గతంలో ఆచంటలో ఆసుపత్రి నడుపుతుండగా ఆయనపై ఆరోపణలు రావడంతో జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేసి ఆసుపత్రిని మూసివేశారుఽ.గత ఏడాది మార్చి 4వ తేదీన పాలకొల్లులో కరూర్ వైశ్యాబ్యాంక్ పక్కన ఒక కాంప్లెక్స్‌ను అద్దెకు తీసుకుని సంపూర్ణ ఆరోగ్య హాస్పిటల్ ఏర్పాటు చేసి సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ప్రారంభింప చేశారు. డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. జిల్లా వైద్యాధికారులు ఆచంటలోని ఆసుపత్రిని మూయించి వేసిన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. పాలకొల్లులో సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిని నెలకొల్పారని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి ఎండీ, ఈహెచ్, జనరల్ మెడిసిన్ (ఏఎంసీ) రిజిస్టర్ నంబర్ 462గా బోర్డుపై ఆయన ముద్రించారు. ఆసుపత్రి నెలకొల్పే ముందు పాలకొల్లులో ఓ రిటైర్డు ఉద్యోగితో మంతనాలు జరిపి ఆయనతో సుమారు రూ.40 లక్షల వరకు పెట్టుబడి పెట్టించినట్టు భోగట్టా. ఈ ఆసుపత్రి ప్రారంభం అయిన నాటినుంచి ఆసుపత్రిలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వేమూరి కృష్ణచౌదరి వైద్యం కోసం వచ్చిన మహిళలతో పాటు ఆసుపత్రిలో పనిచేసిన నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారం రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగగా, వారికి సర్ధిచెప్పి పంపినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వేమూరిని నమ్మి పెట్టుబడి పెట్టిన రిటైర్డు ఉద్యోగి తలపట్టుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిలో డాక్టర్ వేమూరి తప్ప ఇతర వైద్యులు, ఆధునిక పరికరాలు లేవు. ఆసుపత్రి ఏర్పాటు చేసిన భవనానికి అద్దె నిమిత్తం నెలకు రూ.లక్ష చెల్లించాల్సి ఉంది. నాలుగు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ఖాళీ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.
డాక్టర్ వేమూరి వైద్య పట్టా నకిలీదని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఇదేవిధంగా ఆసుపత్రులు తెరచి చాలామందిని మోసగించినట్టు పలువురు వైద్యులు, సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో డాక్టర్ కె.కోటేశ్వరి మాత్రం తాము తనిఖీలు నిర్వహించినపుడు ఆయుర్వేదం సర్టిఫికెట్ చూపించారని, అతని ఆసుపత్రిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండటంతో చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మరోసారి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అసలు గుట్టువిప్పుతారా లేక మిన్నకుండిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది.