మరణించిన 15 ఏళ్ల బాలుడు ∙పరారైన నకిలీ వైద్యుడు
పట్నా: నకిలీ వైద్యుల చేతుల్లో అమాయక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆగట్లేవు. నకిలీడాక్టర్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ 15 ఏళ్ల బాలుడికి శస్త్రచికిత్స చేయబోయి అతని ప్రాణాలు తీసిన ఘటన తాజాగా బిహార్‌లో వెలుగుచూసింది. పరారైన నకిలీ వైద్యుడు, ఆస్పత్రి సిబ్బందిని పట్టుకునేందుకు పోలీసులు వేట మొదలుపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరణ్ జిల్లాలోని మదౌరా పట్టణంలో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పురి ‘శ్రీ గణపతి హాస్పిటల్’ పేరిట ఒక వైద్యశాల నిర్వహిస్తున్నాడు. 15 ఏళ్ల కృష్ణకుమార్ వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతుండటంతో శుక్రవారం రాత్రి అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కాసేపటికి వాంతులు తగినా పిత్తాశయంలో రాళ్లున్నాయని, ఆపరేషన్ తప్పదని వైద్యుడు చెప్పాడు. తండ్రి వారించినా బలవంతంగా ఆపరేషన్ చేశాడు.
బాలుడు విపరీతమైన నొప్పితో బాధపడుతుండటంతో నిలదీయగా గద్దించి పంపించేశాడు. ఇంటికెళ్లాక బాలుడు స్పృహ కోల్పోవడంతో మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడం ముందే పసిగట్టిన వైద్యుడు వెంటనే పటా్న తీసుకెళ్లాలని సూచించాడు. మార్గమధ్యంలోనే బాలుడు కన్నుమూశాడు. ‘‘వైద్యునికి ఎలాంటి అర్హత లేదని మాకు తెలీదు. యూట్యూబ్ చేస్తూ ఆపరేషన్ చేశాడు. తర్వాతే విషయం మాకు అర్థమైంది’’ అని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment