యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశం
వేధింపులకు పాల్పడేలా వీడియోలు ఉండొద్దు
అలాంటివి అప్‌లోడ్ చేయకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే వీడియోలను అప్‌లోడ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించే పోస్టులు తొలగించాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత వేధింపులకు పాల్పడే వీడియోలు పెట్టడం తగదని మందలించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన విధంగా ఏ పౌరుడినీ వేధించే కంటెంట్ ఉండకూడదని తేల్చిచెప్పింది.
‘మీమాంస విక్టిమ్స్’పేరుతో అనధికారిక ప్రతివాదులు పిటిషనర్లపై పెట్టిన వీడియోలు, ఫొటోలు, ఆడియో సందేశాలను వెంటనే బ్లాక్ చేయాలని యూట్యూబ్‌కు చెప్పింది. అలాగే పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించే పోస్టు యూట్యూబ్‌లో పెట్టవద్దని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.
తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్న వీడియోలు, ఫొటోలు, ఆడియో సందేశాలు యూట్యూబ్ నుంచి తొలగించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌కు చెందిన ఎం.శివకుమార్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్ విచారణ చేపట్టారు.
కావాలనే పోస్టులు పెట్టారు..
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న శివకుమార్ సూచన మేరకు మురళీకృష్ణ, సమత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి లాభం పొందారు. ఈ క్రమంలోనే శివకుమార్ తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారంటూ మురళి, సమతతోపాటు మరికొందరు క్రిమినల్ కేసు పెట్టారు.
ఈ కేసు ట్రయల్ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. ‘మీమాంస విక్టిమ్స్’పేరుతో యూట్యూబ్ చానల్ సృష్టించిన మురళి, సమత.. శివ, అతని కుటుంబసభ్యుల ఫొటోలతో పరువు నష్టం కలిగించేలా నిరాధార ఆరోపణలతో 51 వీడియోలు, ఆడియోలు పోస్టు చేశారు. ఈ వేధింపులు భరించలేక శివ భార్య ఆత్మహత్యకు యత్నించింది. ఈ పోస్టులను తొలగించాలని యూట్యూబ్‌కు మెయిల్ పంపినా స్పందన లేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు’ అని చెప్పారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ వివాదంపై వీడియోలు పెట్టడాన్ని తప్పుబట్టారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ముఖ్య కార్యదర్శి, యూట్యూబ్, ఎ.మురళీకృష్ణ, సమతా శ్యామలకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ డిసెంబర్ 4లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment