సాక్షి, హైదరాబాద్: దొంగ బాబాల మాదిరే నకిలీ డాక్టర్లు కూడా పుట్టుకొస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే.. డబ్బు సంపాదించడం.. వీరి ప్రభావం అమాయక ప్రజల మీద చాలా ఎక్కువ. నగరంలో జరిగిన ఓ సంఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అజయ్‌కుమార్ రాయ్(25) చదివింది ఎనిమిదో తరగతి.. కానీ అన్ని వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడయ్యాడు. 2006 సూర్యపేటలో తన బంధువైన ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద పని చేశాడు. ఆ అనుభవంతో నగరానికి వచ్చి ఓ క్లినిక్ ఏర్పాటు చేశాడు. అతని టార్గెట్ అమాయక ప్రజలు. వారిని ఆసరాగా చేసుకుని వైద్యం అందించాలనే నిర్ణయానికి వచ్చాడు ఈ ఫేక్ డాక్టర్.
తనకు అదృష్టం కలిసిరాలని ఈ పేరు పెట్టాడేమో అన్నట్లు ఉంది క్లినిక్ పేరు. శ్రీరామ్ నగర్‌లో లక్కీ క్లినిక్ పేరుతో వృత్తిని ప్రారంభించాడు. సినిమాలకు ట్యాగ్ లైన్స్ ఉన్నట్లు.. క్లినిక్‌కు కూడా ఓ ట్యాగ్ లైన్ పెట్టాడు.‘ ఇక్కడ అన్ని వ్యాధులకు చికిత్స చేయబడను’ అని పెట్టాడు. క్లినిక్‌కు వచ్చిన రోగులకు చేతికోచిన మందులు, సూదులు ఇచ్చి పంపించేవాడు. ప్రస్తుతం అజయ్ యూసఫ్‌గూడలో నివసించేవాడు. ఇతని స్వస్థలం కోల్‌కత్తా అని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారి తెలిపారు.
అంతేకాక తన వద్ద పైల్స్‌కి ప్రత్యేక నివారణ ఉందని నమ్మించాడు. ఆ సమస్యతో బాధపడే వారి నుంచి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల లోపు వసూలు చేశాడు. పాపం ఈ నకిలీ డాక్టర్ దందా ఎన్ని రోజులు నడువలేదు. ప్రజలు దేవుడితో పోల్చే డాక్టర్ వృతిలో సైతం ఇలాంటి నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ క్లినిక్‌లో సోదాలు చేపట్టారు. అప్పుడ బయటపడింది మన డాక్టర్ బాగోతం. అతనికి కనీస విద్యా అర్హత లేకుండా అజయ్‌కుమార్ వైద్యం చేశాడన్ని పోలీసులు గుర్తించారు. ఫేక్ డాక్టర్ నుంచి పోలీసులు వైద్యపరికరాలు, మందులు మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. అజయ్‌ను అరెస్ట్ చేసి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment