ఏసీబీ వలలో డీఎంహెచ్‌ఓ | DMHO Caught While Demanding Bribery in Gadwal | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో డీఎంహెచ్‌ఓ

Published Fri, Jul 24 2020 11:01 AM | Last Updated on Fri, Jul 24 2020 11:01 AM

DMHO Caught While Demanding Bribery in Gadwal - Sakshi

నగదుతో ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ భీమ్‌నాయక్‌

గద్వాల న్యూటౌన్‌: ప్రభుత్వ వైద్యురాలికి పీజీలో సీటులో వచ్చింది. రిలీవ్‌ చేయమని ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓను అడిగింది. సాటి ఉద్యోగికి పీజీలో సీటు వచ్చింది కదా అని సంతోషించి రిలీవ్‌ చేయాల్సింది పోయి ఏకంగా పైసల్‌ డిమాండ్‌ చేశారు. వైద్యురాలు మరోసారి వెళ్లి అడిగినా అదే డిమాండ్‌ను ఆమె ముందు ఉంచారు. దీంతో చేసేదిలేక  వైద్యురాలు, భర్త సాయంతో ఏసీబీని ఆశ్రయించింది.   నెలరోజులుగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి సారించారు. బుద్ధిపోనిచ్చుకోని ఆ జిల్లా అధికారి ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రూ.7వేలు లంచం తీసుకొని రిలీవింగ్‌ ఆర్డర్‌ చేతికి ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన మంజుల అనే పీహెచ్‌సీ వైద్యురాలు గత నెల 17న జిల్లాలోని వడ్డేపల్లి పీహెచ్‌సీకి బదిలీపై వచ్చింది.

విధుల్లో చేరిన మరుసటి రోజే ఆమెకు కాకతీయ మెడికల్‌ కళాశాలలో పీజీలో సీటు వచ్చింది. పీజీలో జాయిన్‌ అయ్యేందుకు నిబంధనల ప్రకారం తనను రిలీవ్‌ చేయమని జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ భీమ్‌నాయక్‌ను కోరింది. ఆయన డబ్బు డిమాండ్‌ చేశాడు. ఈ విషయాన్ని ఆమె భర్త అశోక్‌ తెలిపింది. జూన్‌ 22న ఆయన మహబూబ్‌నగర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  అప్పటినుంచి వారు ఈ కేసుపై దృష్టి సారించి నాలుగుసార్లు గద్వాలకు వచ్చి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాల యంలో ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో వైద్యురాలు  మంజుల నుంచి రూ.7వేలు తీసుకొని రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. తీసుకున్న డబ్బును తన ప్యాంట్‌ జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో డీఎస్పీ కృష్ణగౌడ్, మహబూబ్‌నగర్, నల్గొండ ఏసీబీ అధికారులు ప్రవీణ్‌కుమార్, లింగస్వా మి, ఎస్‌ఐలు రమేష్‌బాబు, వెంకట్రావ్‌లు మరో 10మంది సిబ్బందితో కలిసి రైడ్‌ చేశారు. కార్యాలయంలో ఉన్న అధికారులందరినీ ఎక్కడివారిని అక్కడే కూర్చోబెట్టారు. నేరుగా డీఎంహెచ్‌ఓ చాంబర్‌కు వెళ్లి డీఎంహెచ్‌ఓను తనిఖీ చేశారు. ఆయన ప్యాంట్‌ జేబులో రూ.7వేలు లభించాయి. ఆ నోట్లను పరిశీలించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు.  

లంచం అడిగితే సమాచారం ఇవ్వండి.. 
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ మీడియాతో మాట్లాడారు. ఏదేని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ 1064కు కాల్‌ చేయాలన్నారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.  

వచ్చిన కొద్దిరోజులకే.. 
ఇబ్రహీంపట్నంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా ఉన్న భీమ్‌నాయక్‌ జూన్‌ 3న ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓగా జిల్లాకు బదిలీపై వచ్చాడు. వచ్చిన కొద్దిరోజులకే ఆయనపై పలు ఫిర్యాదులొచ్చాయి. వివిధ విభాగాల్లో ఉన్న ముగ్గురు ఉద్యోగులను డిప్యూటేషన్‌పై వారు కోరిన పీహెచ్‌సీలకు ఉద్దేశపూర్వకంగా మార్చాడని ఆశాఖ అధికారులే తెలిపారు. అయిజలో రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులను సందర్శించి, డబ్బులు డిమాండ్‌ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. తనకు నచ్చిన నలుగురు ఉద్యోగులతో ఓ మాదిరి, మిగిలిన ఉద్యోగులతో మరో మాదిరిగా వ్యవహరించేవారని వైద్యులు  తెలిపారు. సదరు నలుగురు ఉద్యోగులే పలు వ్యవహారాలు చక్కబెట్టావారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement