151 జీఓ ప్రకారం జీతాలు చెల్లించాలి
అనంతపురం మెడికల్ : ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతూ జీవో నంబర్ 151 విడుదల చేసిందనీ, అందువల్ల ఆ మేరకు తమకు వేతనాలు ఇవ్వాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం వారు డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 45 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్స్ పని చేస్తున్నట్లు చెప్పారు. తమకు రూ.9,500 వేతనం వస్తుండగా గత ఆగస్టులో రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు. అయినా పెంచిన వేతనాలు మాత్రం రావడం లేదన్నారు. తక్షణం సమస్యను పరిష్కరించి కొత్త జీతాలు వేయాలన్నారు.