భయపెడుతున్న ‘డెంగీ’ భూతం
భయపెడుతున్న ‘డెంగీ’ భూతం
Published Sun, Sep 4 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
అధికారులను పరుగులు పెట్టిస్తున్న మహమ్మారి
తగ్గుముఖం పట్టాయంటున్న డీఎంహెచ్‌ఓ
కాకినాడ రూరల్ : జిల్లాలో డెంగీ కేసులు నమోదు కావడం ఇటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అటు పంచాయతీ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. రోజుకో గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడం, కొన్ని గ్రామాల్లో జ్వర పీడితులు చనిపోవడంతో అధికారులు గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం పాత గైగోలుపాడులో ఓ మహిళ డెంగీ లక్షణాలతో ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో, ఆ ప్రాంతానికి వైద్య శాఖ, పంచాయతీ అధికారులు చేరుకున్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, ఇంటింటా రక్తపూతలను సేకరిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి చంద్రయ్య పాత గైగోలుపాడులో ఎంపీడీఓ సీహెచ్‌కే విశ్వనాథరెడ్డి, మండల వైద్యాధికారి ఐ.ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి టీవీవీ సత్యనారాయణతో కలసి పర్యటించారు.
విషజ్వరాలు తగ్గుముఖం : ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. విషజ్వరాలు సోకడానికి పారిశుద్ధ్య లోపమే కారణమని గుర్తించినట్టు వివరించారు. జిల్లాలో డెంగీ వల్ల నలుగురు చనిపోయారని, 102 కేసులు నమోదయ్యాయని వివరించారు. 600 మందికి పైగా విషజ్వరాలు సోకినట్టు గుర్తించామన్నారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో 92, ఏజెన్సీ ప్రాంతాల్లో 282 వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్యసేవలు అందజేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ప్రతి వీధిలోను వైద్య సిబ్బంది పర్యటించి, ప్రజల ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ అపరిశుభ్రత కనిపించినా వెంటనే పంచాయతీ అధికారులకు సమాచారం అందజేయాలని చెప్పారు. ఎవరైనా పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గైగోలుపాడులో చనిపోయిన మహిళ డెంగీతో మరణించలేదని, ఆమెకు వరుసగా రెండు సార్లు జ్వరం రావడంతో వైద్యం చేయించుకోవడంలో కొంత నిర్లక్ష్యం ప్రదర్శించిందని తెలిపారు.
Advertisement