dengi
-
డెంగీ లక్షణాలతో విద్యార్థి మృతి
చిలకలూరిపేటటౌన్: డెంగీ లక్షణాలతో విద్యార్థి మృతిచెందిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలో సోమవారం జరిగింది. విద్యార్థి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు... పట్టణంలోని 25వ వార్డు పరిధిలోని అడ్డరోడ్డు సెంటర్లో నివాసం ఉండే బలగం కిషోర్ కుమారుడు బలగం జగదీష్ (16) జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఈ నెల 8వ తేదీన జ్వరం, వళ్లు నొప్పులు, విపరీతమైన తలనొప్పి వంటి డెంగీ లక్షణాలతో బాధపడుతుండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన స్థానిక వైద్యులు ప్లేట్లెట్లు 11 వేలకు పడిపోయాయని, విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, గుంటూరు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. వెంటనే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీష్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విద్యార్థి తండ్రి బలగం కిషోర్ పౌండ్రీవర్క్షాపు నిర్వహిస్తున్నారు. తల్లి లత గృహిణి. తమ్ముడు అఖిల్ ఏడో తరగతి చదువుతున్నాడు. చిన్న వయస్సులోనే జగదీష్ మృతి చెందడటంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ ఇంటి సమీపంలో ఏర్పడిన అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా దోమల సంచారం పెరగటం వలననే తమ బిడ్డ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం వల్లే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ గోపినాయక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మర్రిరాజశేఖర్ పరామర్శ.... జగదీష్ మతి చెందిన విషయం తెలుసుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్ అతని నివాసానికి చేరుకొని నివాళి అర్పించారు. విద్యార్థి తాతయ్య బలగం రాఘవయ్య, తండ్రి కిషోర్ ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో 25వ వార్డు కౌన్సిలర్ షేక్ నాగుల్‌మీరా, మున్సిపల్ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ షేక్‌అబ్దుల్ రౌఫ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్‌అబ్దుల్లా , పార్టీ నాయకులు అనంతవీరరాఘవులు, బైరా వెంకటకోటి, గేరాలింకన్ తదితరులు ఉన్నారు. -
రెండేళ్లకే నూరేళ్లు
గుడివాడలో డెంగీతో చిన్నారి మృతి గుడివాడ టౌన్: డెంగీ జ్వరం గుడివాడ పట్టణంలో తిష్ట వేసింది. గతవారం రోజుల్లో మూడు మరణాలు సంభవించటం ఇందుకు నిదర్శనం. స్థానిక ధనియాల పేటకు చెందిన ఎస్కె దోష్ బీ (2) అనే చిన్నారి బాలిక డెంగీ వాధితో గురువారం మృతి చెందింది. పోయిన గురువారం జ్వరం గమనించిన తల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శనివారం పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు డెంగ్యీ సోకిందని బుధవారం ప్లేట్లెట్స్ ఎక్కించారు. అయినప్పటికి ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం చిన్నారికి నూరేళ్లు నిండాయి. ఈ పాపకు ఇటీవలే తల్లిదండ్రులు రెండో పుట్టినరోజును ఘనంగా జరిపారు. అంతలోనే విగతజీవిగా మారడం కన్నవారితో పాటు బంధుమిత్రుల్ని తీవ్ర విషాదం నింపింది. పారిశుధ్య లేమితో దోమల బెడద పట్టణంలో పారిశుధ్య లోపం వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా దోమలు బాధిస్తున్నాయని, బురదరోడ్లు, మురుగునీటి వల్ల వాటి బెడద సమస్యగా మారిందని వాపోయారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. పట్టణంలో జ్వరాలు ఇంటింటినీ వేధిస్తున్నా వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు. -
డెంగీతో వివాహిత మృతి
సూర్యచంద్రరావుపేట(ద్వారకాతిరుమల) : డెంగీతో ఓ వివాహిత మరణించింది. ఆమె కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సూర్యచంద్రరావుపేటకు చెందిన సర్నాల నాగలక్ష్మి(27)కి 20 రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. స్థానికంగా చికిత్స పొందడంతో జ్వరం తగ్గింది. ఈ నేపథ్యంలో గత శనివారం ఆమెకు భరించలేనంతగా తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సనందించిన వైద్యులు డెంగీ అని నిర్ధారించి గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో సోమవారం రాత్రి నాగలక్ష్మిని గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మధ్యాహ్నం మృతిచెందింది. వైద్యులు ఆమెకు డెంగీ జ్వరం సోకినట్టు నిర్ధారించారని ఆమె భర్త రాంబాబు చెప్పారు. నాగలక్ష్మి మృతితో గ్రామం ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు, పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి చెలికాని రాజబాబు, నాయకులు బుసనబోయిన సత్యన్నారాయణ, మానుకొండ సుబ్బారావు, గుర్రాల లక్ష్మణ్ తదితరులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. -
కొత్తవుడియంలో డెంగీ
బి.కొత్తకోట: మండలంలోని బడికాయలపల్లె పంచాయతీ కొత్తవుడియంలో డెంగీ వ్యాధి వెలుగుచూసింది. దీనితో వైద్యాధికారులు సోమవారం అప్రమత్తం అయ్యారు. కొత్తవుడియంకు చెందిన మేఘన(7)కు మూడురోజులుగా జర్వం రావడంతో స్థానిక, మదనపల్లెలో వైద్యం అందించారు. డెంగీ వ్యాధి సోకిందన్న అనుమానంతో తిరుపతి రుయా తరలించగా అక్కడ మేఘనకు పరీక్షలు నిర్వహించగా డెంగీ సోకినట్టు నిర్దారించారు. విషయం తెలుసుకొన్న మదనపల్లె డివిజన్ కార్యక్రమాల అమలు అధికారి టీ.మునిరత్నం, ఎంపీడీవో గంగయ్య, సర్పంచు జయచంద్రనాయుడు, కార్యదర్శి సిగ్బతుల్లా, వైద్యాధికారిణి గంగాదేవి, వైద్య సిబ్బంది కొత్తవుడియం చేరుకొన్నారు. మురికినీటి కాలువలను శుభ్రం చేయించారు. బ్లీచింగ్ చల్లించి, గ్రామస్తులకు జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగా కాలువలు పరిశీలించి ఇంకా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని, వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
డెంగీ ప్రాణాంతక వ్యాధి కాదు
ఉయ్యూరు : మలేరియా, డెంగీ ప్రాణాంతక వ్యాధులు కాదని డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి అన్నా రు. ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆమె సందర్శించారు. దోమలపై దండయాత్ర, దోమల నివారణ చర్యలు, వైరల్ జ్వరాలపై సమీక్షించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పగటి దోమలతోనే డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. జిల్లాలో 120 డెంగీ కేసులు, 370 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. జ్వరం వస్తే ఆరోగ్య ఉప కేంద్రం, పీహెచ్సీలో వైద్యుల్ని సంప్రదించాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. వైద్యులు బాలకృష్ణ, శోభ పాల్గొన్నారు. -
డెంగీ పడగ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో డెంగీ జ్వరాలు పడగ విప్పాయి. ప్రతిచోట ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. అధికారులు మాత్రం ఇప్పటివరకూ మూడు కేసులు మాత్రమే నమోదైనట్టు చూపిస్తున్నారు. అనధికారికంగా వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. జిల్లాలోని అనేక ఆసుపత్రుల్లో డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఏజెన్సీలో ప్రమాదకరమైన కాళ్లవాపులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొయ్యలగూడెంలో ఇద్దరు తాజాగా కొయ్యలగూడెం మండలంలో ఇద్దరు డెంగీబారిన పడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారు చికిత్స పొందుతున్నారు. కొయ్యలగూడెంకు చెందిన ఎస్కే హసీనా డెంగీ లక్షణాలతో రాజమండ్రిలో చికిత్స పొందుతోంది. వీఎస్ఎన్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హసీనాకు వారం రోజుల క్రితం జ్వరం, తలపోటు రావడంతో పరీక్షలు నిర్వహించారు. డెంగీ లక్షణాలు కనబడటంతో ఆమెను రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్లేట్లెట్స్ 80 వేలకు పడిపోయాయని, ఆమెకు డెంగీ వ్యాధి సోకినట్టు డాక్టర్లు నిర్థారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే మండలంలోని కన్నాపురానికి చెందిన తెలిపేట రామిరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి అనే గిరిజన యువకునికి 15 రోజులుగా చికిత్స అందిస్తున్నా జ్వరం తగ్గకపోవడంతో తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిం చారు. అతనికి కూడా డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. ప్లేట్లెట్స్ 30వేలకు పడిపోయాయి. సందీప్‌రెడ్డి వైజాగ్‌లో ఎంబీఏ చదువుతున్నట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీహెచ్‌ఈవో జి.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి కన్నాపురంలో సోమవారం సర్వే చేపట్టారు. ‘్రౖపైవేట్’ దోపిడీ తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన రోగికి డెంగీ లక్షణాలు కనిపిస్తే కనీసం రూ.50వేలకు పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్లేట్లెట్స్ ఎక్కించడానికి డోసుకు కనీసం రూ.10 వేలు ఖర్చవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా ప్లేట్లెట్స్ ఎక్కించే సౌకర్యాలు లేవు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అధికారులు మూడు డెంగీ కేసులే ఉన్నాయని చెబుతున్నా.. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ సంస్థ నివేదికల ప్రకారం చూస్తే వందమందికి పైగా జ్వర పీడితుల్లో డెంగీ లక్షణాలు ఉన్నట్టు వెల్లడైంది. ఏజెన్సీలో కాళ్లవాపులు ఏజెన్సీ ప్రాంతంలో జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కాళ్లు విపరీతంగా వాచిపోతున్నాయి. అరికాళ్లతోపాటు శరీరమంతా విపరీతమైన నొప్పులు ఉండటంతో బాధితులు నడవడం కూడా ఇబ్బందికరంగా ఉంటోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో కాళ్లవాపులతో పలువురు మృత్యువాత పడటంతో కాళ్లవాపులు వచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. వాపులతో బాధపడుతున్నవారు స్థానికంగా మందులు వాడుతున్నా ఏ మాత్రం ప్రయోజనం లేకుండాపోతోంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ వీటిపై దృష్టి పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు. -
వర్ధమాన క్రికెటర్‌ను బలిగొన్న డెంగీ
బోడుప్పల్: వర్ధమాన క్రికెట్ క్రీడాకారుడిని డెంగీ కబళించింది. క్రికెట్లో రాణిస్తున్న బోడుప్పల్ శ్రీసాయినగర్ కాలనీకి చెందిన సాయి విశ్వనాథ్‌రాజు(17) గురువారం రాత్రి డెంగీ జ్వరంతో మరణించాడు. వివరాలివీ... బోడుప్పల్ శ్రీసాయినగర్‌కాలనీలో నివసించే బుద్ధరాజు సీతారామరాజు, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు. సీతారామరాజు సంగారెడ్డిలోని యూబీ కంపెనీలో ఎలక్ట్రీషియన్. పెద్ద కుమారుడు సాయి విశ్వనాథ్‌రాజు(17) సైనిక పురిలోని భవన్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. క్రికెట్లో రాణిస్తున్నాడు. వారం క్రితం ఇతడికి జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రిలో చూపించుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో రెండు రోజుల క్రితం పీర్జాదిగూడలోని స్పార్క్ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా డెంగీ అని తేలడంతో చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి సాయి విశ్వనాథ్‌రాజు మృతి చెందాడు. శుక్రవారం భవన్స్ కాలేజీ విద్యార్థులు, తోటి క్రికెట్ టీం సభ్యులు విశ్వనాథ్ రాజు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే క్రికెట్.. సాయి విశ్వనాథ్‌రాజు చిన్నతనం నుంచి క్రికెట్‌పై ఆసక్తి చూపేవాడని, దీంతో 8 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడని మృతుడి తండ్రి సీతారామరాజు, కోచ్ సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు స్కూల్ లెవెల్లో రంగారెడ్డి జిల్లాలో, అండర్ 16 ఏ డివిజన్ లెవెల్లో ఆడాడు. ఇటీవల నేషనల్ లెవెల్లో ఢిల్లీ, గోవాలో వైస్ కెప్టెన్ గా ఆడగా బెస్ట్‌అవార్డుతోపాటు మేన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టుడే లీగ్ మ్యాచ్‌లు 19 ఆడాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడని, ఇంతలో డెంగీ రూపంలో సాయివిశ్వనాథ్‌రాజును మృత్యువు కబళించిందన్నారు. -
డెంగీ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
కట్టంగూర్ నల్లగొండలో డెంగీ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం కట్టంగూర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విషజ్వరాల బారినుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం నామమాత్రపు చర్యలు చేపట్టిందని ఆరోపించారు. డెంగీ బారిన పడి పదుల సంఖ్యలో చనిపోయినా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవటం శోషనీయమన్నారు. డెంగీ బారిన పడిన రోగులు ప్రవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇదే అదునుగా ప్రవేట్ ఆస్పత్రి యాజమాన్యం దోపిడీకి అంతులేకుండా పోయిందన్నారు. ఒక్కొక్క రోగి నుంచి రూ. రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షలు అందజేయాలని కోరారు. సమావేశంలో ఆపార్టీ జిల్లా కమిటి సభ్యుడు మామిడి సర్వయ్య, మండల కార్యదర్శి నంధ్యాల వెంకట్‌రెడ్డి, పెంజర్ల సైదులు, కట్ట బక్కయ్య ఉన్నారు. -
భయపెడుతున్న ‘డెంగీ’ భూతం
అధికారులను పరుగులు పెట్టిస్తున్న మహమ్మారి తగ్గుముఖం పట్టాయంటున్న డీఎంహెచ్ఓ కాకినాడ రూరల్ : జిల్లాలో డెంగీ కేసులు నమోదు కావడం ఇటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అటు పంచాయతీ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. రోజుకో గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడం, కొన్ని గ్రామాల్లో జ్వర పీడితులు చనిపోవడంతో అధికారులు గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం పాత గైగోలుపాడులో ఓ మహిళ డెంగీ లక్షణాలతో ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో, ఆ ప్రాంతానికి వైద్య శాఖ, పంచాయతీ అధికారులు చేరుకున్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, ఇంటింటా రక్తపూతలను సేకరిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి చంద్రయ్య పాత గైగోలుపాడులో ఎంపీడీఓ సీహెచ్‌కే విశ్వనాథరెడ్డి, మండల వైద్యాధికారి ఐ.ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి టీవీవీ సత్యనారాయణతో కలసి పర్యటించారు. విషజ్వరాలు తగ్గుముఖం : ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. విషజ్వరాలు సోకడానికి పారిశుద్ధ్య లోపమే కారణమని గుర్తించినట్టు వివరించారు. జిల్లాలో డెంగీ వల్ల నలుగురు చనిపోయారని, 102 కేసులు నమోదయ్యాయని వివరించారు. 600 మందికి పైగా విషజ్వరాలు సోకినట్టు గుర్తించామన్నారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో 92, ఏజెన్సీ ప్రాంతాల్లో 282 వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్యసేవలు అందజేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ప్రతి వీధిలోను వైద్య సిబ్బంది పర్యటించి, ప్రజల ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ అపరిశుభ్రత కనిపించినా వెంటనే పంచాయతీ అధికారులకు సమాచారం అందజేయాలని చెప్పారు. ఎవరైనా పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గైగోలుపాడులో చనిపోయిన మహిళ డెంగీతో మరణించలేదని, ఆమెకు వరుసగా రెండు సార్లు జ్వరం రావడంతో వైద్యం చేయించుకోవడంలో కొంత నిర్లక్ష్యం ప్రదర్శించిందని తెలిపారు. -
డెంగీతో వణుకుతున్న దివిసీమ
ఎటుచూసినా జ్వరాల పీడితులే చికిత్స కోసం పట్టణాలకు పరుగులు ‘మాజేరు’ను తలచుకుని వణుకు కన్నెత్తిచూడని వైద్యాధికారులు అవనిగడ్డ: డెంగీ, వైరల్ జ్వరాలు రోజురోజుకీ విజృంభించడంతో దివిసీమవాసులు బెంబేలెత్తి పోతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో పలు రకాల జ్వరాలతో జనం బాధపడుతున్నారు. నెలరోజుల క్రితం అవనిగడ్డ మండల పరిధిలోని రామకోటిపురంలో సుమారు 75 మంది వరకూ జ్వరాలబారిన పడగా, వీరిలో 18 మంది డెంగీ లక్షణాలతో చికిత్స తీసుకున్నారు. దీనిపై ప్రజల్లో గగ్గోలు రేగడంతో ఈ నెల 15 నుంచి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న కొత్తపేటకు జ్వరాలు విస్తరించాయి. ఈ రెండు గ్రామాల్లో వంద మందికి పైగా పలు రకాల జ్వరాలతో చికిత్స పొందారు. ఇక్కడి వైద్యశిబిరానికి వచ్చిన 13 మంది డెంగీ అనుమానితులను విజయవాడ ఆస్పత్రులకు పంపినట్లు స్థానిక పీహెచ్సీ వైద్యుడు డా.శివరామకృష్ణ తెలిపారు. అవనిగడ్డలో వీఆర్వోగా పనిచేస్తున్న వీఆర్వో శేషుబాబు, ఆయన భార్యకి డెంగీ జ్వరంతో విజయవాడలో చికిత్స పొందుతున్నారు. పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. రోజురోజుకూ విజృంభిస్తున్న జ్వరాలు ప్రస్తుతం దివిసీమలోని వైద్యశాలలన్నీ జ్వర పీడితులతో కిక్కిరిసి పోతున్నాయి. కోడూరు మండలంలోని విశ్వనాధపల్లి, వి కొత్తపాలెం, కోడూరులో పలువురు డెంగీ లక్షణాలతో వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. అవనిగడ్డ మండలంలోని కొత్తపేట, రామకోటిపురం, మోదుమూడి, అశ్వరావుపాలెం, వేకనూరు, అవనిగడ్డ, మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లి, నాగాయతిప్ప, కొక్కిలిగడ్డ, కె కొత్తపాలెం, పెదప్రోలు, చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం, రామానగరం గ్రామాల్లో జ్వరాల బాధితులు ఎక్కువుగా ఉన్నారు. సుమారు వందమంది వరకూ డెంగీకి గురైనట్లు అంచనా. మేల్కొనకపోతే మరింత ప్రమాదమే గత ఏడాది జూౖలై నుంచి సెప్టెంబర్ మధ్య చల్లపల్లి మండలం మాజేరులో 16 మంది డెంగీ, విషజ్వరాలుబారిన పడి మరణించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోçß毌æరెడ్డి ఈ గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడంతో పాటు, బాధిత కుటుంబాలతో మచిలీపట్నంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం తెలిసిందే. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పారిశుధ్య పనులు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు. -
డెంగీ బాధితులను ఆదుకుంటాం
ముచ్చింతాల (పెనుగంచిప్రోలు) : డెంగీ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామంలో డెంగీ లక్షణాలతో మృతి చెందిన కనపర్తి పుల్లయ్య, జోజి కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు అనిల్‌కుమార్, సుష్మలకు సూచించారు. డీఎంహెచ్‌వో నామల్లేశ్వరి కూడా గ్రామంలో పర్యటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, తహసీల్దార్ కె నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గింజుపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి
మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను డిమాండ్ ముచ్చింతాల(పెనుగంచిప్రోలు): డెంగీ జ్వరాలతో గ్రామంలో మరణించిన ఎస్సీ కాలనీకి చెందిన కనపర్తి పుల్లయ్య, జోజి కుటుంబాలు ఒకొక్కరికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జ్వరాలతో మృతి చెందిన పుల్లయ్య, జోజి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు సరైన వైద్యం అందించాలని, ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేసి పేద కుటుంబాలను ఆదుకోవాలని వైద్యాధికారి అనిల్‌కుమార్‌కు సూచించారు. డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరితో ఫోన్లో మాట్లాడి గ్రామాన్ని సందర్శించాలని, వైద్య శిబిరం పూర్తిగా జ్వరాలు తగ్గేవరకు కొనసాగించాలని కోరారు. అనంతరం గ్రామ నాయకులు మల్లెంపాటి సురేష్‌బాబు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో డెంగీ వ్యాధిని తీసి వేయడం దారుణమని, తక్షణమే జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉన్నా 24 గంటలు దాటినా డీఎంహెచ్‌వో, తహసీల్దార్, తదితర అధికారులు రాకపోవటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చవల రామారావు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఇంజం కేశవరావు, మండల కన్వీనర్ కంచేటి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల వెంకటాచలం, గ్రామ అధ్యక్షుడు నూకవరపు శ్రీనివాసరావు, ఎస్సీసెల్ నాయకులు వడ్డీకాసులు, గ్రామ యూత్ నాయకులు మన్నే రమేష్, ఇంజం అనిల్‌కుమార్ పాల్గొన్నారు. పవన్‌కళ్యాణ్ ఇప్పుడు నిద్రలేచాడా? పెద్దమోదుగపల్లి (వత్సవాయి) : జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు దురుద్ధేశపూర్వకంగా ఉన్నాయని సామినేని ఉదయభాను ఆరోపించారు. ఆదివారం మండలంలోని పెద్దమోదుగపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ రెండేళ్ల తరువాత నిద్రలేచి ప్రత్యేకహోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా పోరాటాలు, ధర్నాలు చేసిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని గమనించిన చంద్రబాబు మళ్లీ పవన్‌తో జిమ్మిక్కులకు తయారయ్యారని విమర్శించారు. -
విషజ్వరాలు విజృంభణ
ముచ్చింతాలలో ఒకరి మృతి పది రోజుల్లో పది మృతి కేసుల నమోదు డెంగీ లక్షణాలతో పలువురు విజయవాడ, ఖమ్మం ఆస్పత్రుల్లో చేరిక ముచ్చింతాల(పెనుగంచిప్రోలు) : పల్లెలు పడకేస్తున్నాయి. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు గ్రామాలగ్రామాలు జ్వరాల బారినపడుతున్నాయి. అక్కడక్కడ డెంగీ లక్షణాలతో అనేక కేసులు నమోదవుతున్నాయి. విషజ్వరంతో గ్రామానికి చెందిన కనపర్తి పుల్లయ్య(45) మృతి శనివారం చెందాడు. ఐదు రోజుల క్రితమే అతని సోదరుడు జోజి(41) మృతి చెందాడు. వీరిద్దరు ప్లేట్లెట్స్ పడిపోయి మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పది రోజుల్లో గ్రామంలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు సమాచారం. అలాగే పుల్లయ్య భార్య మేరి, జోజి భార్య జయమ్మ, కుమారుడు వీరస్వామి కూడా తీవ్ర జ్వరంతో ప్లేట్లెట్స్ తగ్గి పూర్తిగా నీరసించి పోవటంతో శనివారం సాయంత్రం ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలించారు. ఒక పక్క కుటుంబ సభ్యులు చనిపోయి ఉండగా మరోపక్క ఒకొక్కరికి విషజ్వరాలతో ఆస్పత్రికి చేరుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాలనీకి చెందిన 20 మంది వరకు ప్లేట్లెట్స్ తగ్గి డెంగీ లక్షణాలతో విజయవాడ, ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తక్షణం జిల్లా అధికారులు స్పందించి గ్రామంలో గ్రామంలో రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. -
జమ్మికుంటలో ఇద్దరు చిన్నారులకు డెంగీ?
అపరిశుభ్రంగా పట్టణం వ్యాప్తి చెందుతున్న దోమలు జమ్మికుంట : పట్టణంలోని ఐదో వార్డుకు చెందిన రాజేశం (మండల సర్వేయర్) పిల్లలు అఖిల్, నేహకు డెంగీ సోకినట్లు ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్ధరించారు. వీరు నాలుగురోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు వారికి డెంగీ ప్రబలినట్లు వైద్యులు పేర్కొన్నారని రాజేశం తెలిపారు. పట్టణంలోని ఏ వార్డు చూసినా.. అపరిశుభ్రత రాజ్యమేలుతోందని కాలనీలవాసులు ఆరోపిస్తున్నారు. మురుగుకాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. నగర పంచాయతీ పరిధిలోని 5, 6, 7, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వార్డుల్లో మురుగుకాలువలు అపరిశుభ్రంగా మారాయి. చెత్తాచెదారం పేరుకపోవడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు వ్యాప్తి చెంది రోగాలు సోకుతున్నాయి. కూరగాయల మార్కెట్ ఏరియా, అంబేద్కర్ కాలనీ, దుర్గకాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ, పాత వ్యవసాయ మార్కెట్ రోడ్డు, పీఏసీఎస్ ఏరియా, వర్తక సంఘం ఏరియాల్లో మురుగు కాలువల్లో చెత్తచెదారం నిండి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ ప్రాంతాల్లో ఉంటున్నవారే అధికంగా రోగాల పాలవుతున్నట్లు ఆసుపత్రుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. రోగాల నియంత్రణకు ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నగరంలో డెంగీ భయం
మధురానగర్‌లో చిరుద్యోగి మృతి మధురానగర్: నగరంలో చాప కింద నీరులా డెంగీ విస్తరిస్తోంది. మధురానగర్ 45వ డివిజన్ సాయిబాబా కాలనీ నాలుగోలైనుకు చెందిన రంగాల రమేష్‌బాబు (49) అనే వ్యక్తి గురువారం డెంగీ జ్వరంతో ప్రాణాలొదిలారు. రమేష్ బాబు ఒక పాదరక్షల షోరూమ్‌లో చిరుద్యోగి. నాలుగు రోజుల క్రితం పుష్కరస్నానం చేశారు, వెంటనే జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం పెరగడంతో బుధవారం ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు డెంగీ గా నిర్ధరించారు. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోయాయని వైద్యులు చెప్పారు. గురువారం పరిస్థితి విషమించటంతో మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవటంతో వారి ఆర్తనాదాలు చూపరులను కంటతడిపెట్టించాయి. అసలే దోమలకు నిలయమైన మధురానగర్‌లో డెంగీతో మృతిచెందటంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డివిజన్లో విషజ్వరాలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
వణికిస్తున్న డెంగీ
జిల్లాలో ఇద్దరు మృతి అవనిగడ్డ ప్రాంతంలో మరో 20 అనుమానిత కేసులు విజయవాడ (లబ్బీపేట) : డెంగీ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవనిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన గరికిపాటి పోతురాజు, చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన మందపాటి ప్రసాదరెడ్డి ఎన్ఆర్ఐ డెంగీ జ్వరంతో మృతిచెందారు. అవనిగడ్డ ప్రాంతంలో మరో 20 మంది వరకూ డెంగీ అనుమానిత బాధితులు ఉన్నట్లు అధికారిక వర్గాలు చెపుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో సైతం డెంగీ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. ఉయ్యూరు మండలం కాటూరుకు చెందిన ఓ వ్యక్తికి వారం రోజుల క్రితం డెంగీ జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా పదుల సంఖ్యలో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. పుష్కర విధుల్లో వైద్య సిబ్బంది జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తుండగా వైద్య శాఖ సిబ్బంది అంతా పుష్కర విధుల్లో నిమగ్నమయ్యారు. దీంతో జ్వరం వచ్చినా చికిత్స చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. ప్రతి పీహెచ్సీలో ఒకరిద్దరు ఏఎన్ఎంలు మాత్రమే ఉంటున్నారు. దీంతో జ్వర బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. అప్రమత్తతే మందు ఎడిస్ ఈజిప్ట్ ఐ అనే దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగీ జ్వరాలకు సంబంధించి అప్రమత్తతే నివారణకు మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిపై ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఫ్లవర్వాజ్లలో నిల్వవున్న మంచినీటిలో దోమ లార్వా వృద్ధి చెందుతుందని చెపుతున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఈ దోమ వృద్ధి చెందితే అక్కడ పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు తేలికపాటి ఆహారం, ద్రవపదార్ధాలు, తాజా పళ్లరసాలు తీసుకోవడం ద్వారా జ్వరప్రభావం ఎక్కువగా లేకుండా చూడవచ్చునని సూచిస్తున్నారు. డెంగీ ప్రమాదమా ? డెంగ్యూ జ్వరం 95 శాతం మందిలో సాధారణ జ్వరంలా సోకి తగ్గిపోతుందని నిపుణులు చెపుతున్నారు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొందరికి మామూలు పారాసెట్మాల్ టాబ్లెట్‌కి తగ్గిపోతుందని చెపుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గిన వారికి ప్రాణాంతకంగా మారుతుందంటున్నారు. జ్వరం తగ్గిన వారం రోజులకు కూగా శరీరంలో డెంగీ యాంటీ బాడీస్ ఉండడంతో ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంది. వీరికి సోకితే ప్రమాదమే దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి డెంగీ జ్వరం సోకితే ప్రమాదకరంగా మారుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువుగా ఉన్న చిన్నపిల్లలకు సోకితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వారు డెంగీ జ్వరమని నిర్ధారణ అయిన వెంటనే మెరుగైన వైద్యం పొందాల్సి ఉంది. అనుమానిత కేసులు నమోదు జిల్లాలో అక్కడక్కడా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు అధికారికంగా 20 కేసులు నమోదయ్యాయి. కాగా ర్యాపిడ్ టెస్ట్ చేసి ఎన్ఎస్వీ పాజిటివ్‌గా రిపోర్టు ఇస్తున్నారు. దానిని డెంగీగా పరిగణించలేం. ఒక్క ఎలిసా పరీక్ష ద్వారా నిర్ధారణ అయితేనే డెంగీగా పరిగణిస్తాం. అవనిగడ్డలో ప్రత్యేక శిబిరం పెట్టి జ్వరాలు ఉన్న వారి రక్తం నమూనాలు సేకరించనున్నాం. నగరంలో సైతం అక్కడక్కడ జ్వరం కేసులు నమోదవుతున్నాయి. – ఆదినారాయణ, జిల్లా మలేరియా అధికారి -
డెంగీతో ఒకరి మృతి
తాడ్వాయి : తాడ్వాయి మండలంలోని భస్వన్నపల్లి గ్రామానికి చెందిన గెర్రె చిన్న రాములు (42) డెంగీ జ్వరంతో మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం తీవ్రంగా జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని జీవదాన్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు రాములుకు డెంగీ లక్షణాలు ఉన్నాయని వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. రాములును హైద్రాబాద్‌లోని ప్రవేటు హాస్పిటాల్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి మరికొందరు డెంగీతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. -
వణికిస్తున్న విష జ్వరాలు
–టెక్కలి కోదండరామ వీధిలో జ్వరాల విజృంభణ –ఇప్పటికే నలుగురికి డెంగీ జ్వరాలుగా నిర్ధారణ – ప్రైవేట్ ఆస్పత్రులే దిక్కు –కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపమే కారణం! డివిజన్ కేంద్రమైన టెక్కలిలోని కోదండరామవీధిలో విష జ్వరాలు విజృంభించాయి. ఈ దళిత వాడలో ఇంటికొకరు చొప్పున విష జ్వరాల బారిన పడ్డారు. ఇప్పటికే ఇద్దరు చిన్నారులతో పాటు ఇద్దరు యువకులు డెంగీ భారిన పడ్డారు. ప్రాణాలు దక్కించుకోవడానికి వేలాది రూపాయలు అప్పులు చేసి ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించారు. టెక్కలి : విష జ్వరాలు విజృంభించడంతో టెక్కలిలోని దళితవాడ కోదండరామ వీధి గజగజలాడుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఎం.నందిత, ఎం.ఉదయ్, వారి మేనమామ వై.అశోక్‌కుమార్ డెంగీ బారిన పడ్డారు. ఇక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. మరో యువకుడు ఆర్.దుర్గారావు ప్రస్తుతం డెంగీ జ్వరంతో పలాసలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరితో పాటు పర్రి వెంకటేష్, యడ్ల వెంకటేష్, టి.రాజ్‌కుమార్, ఎస్.కళ్యాణ్, నీలవేణి, నాగేంద్ర, టి.సోమేశ్వరరావు, టి.పార్వతమ్మ, టి.మోహిని తదితరులు మంచం పట్టారు. విష జ్వరాలతో ప్రస్తుతం కోదండరామవీధి వాసులు ఆందోళన చెందుతున్నారు. క్షీణించిన పారిశుద్ధ్యం.. కోదండరామవీధిలో విష జ్వరాల విజృంభణకు పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరే కారణమని స్థానికులు చెబుతున్నారు. వీధిలో పారిశుదం్ధ్య పనులు చేపట్టాలని పలుమార్లు పంచాయతీ యంత్రాంగానికి విన్నవించినా స్పందించలేదని స్థానికుడు బి.ధనుంజయరావు ‘సాక్షి’ వద్ద వాపోయాడు. వీధిలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నా కూత వేటు దూరంలో ఉన్న వైద్య సిబ్బంది కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
కలవరపెడుతున్న డెంగీ
కంఠేశ్వర్, న్యూస్‌లైన్: డెంగీ విజృంభిస్తోంది. భారీ వర్షాలు కురియడంతో గత ఏడాది కంటే ప్రస్తు తం ఈ వ్యాధి తీవ్రత పెరిగింది. వ్యాధి నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. రెండున్నర నెలలలోనే జిల్లాలో డెంగీ కేసులు 15కు చేరాయి. అధికారులు మాత్రం తప్పుడు నివేదికలు చూపుతున్నారు. జూన్ నెలలో జిల్లా కేంద్రంలో ఆసియాబేగం (34), బాన్సువాడ మండలం సంగోజీపేటలో మరొకరికి డెంగీ సోకినట్లు నిర్ధారించారు. జులై నెలలో తాడ్వాయి మండలం తిమ్మక్‌పల్లిలో శంకర్ (28), విష్ణు (4), మాక్లూర్ మండలం ముత్యంపల్లిలో సంగీత (22) ఈ వ్యాధి బారినపడ్డారని చెబుతున్నారు. వీరు కాక మరికొందరి కి డెంగీ సోకినా వైద్య శాఖ నివేదికలో మాత్రం వారి గురించి పేర్కొన లేదు. నాగిరెడ్డిపేటలో ఒక టీచర్, లింగంపేట మండలం భవానిపేటకు చెందిన సందీప్ (22) బోధన్‌కు చెందిన ముగ్గురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. డిచ్పల్లి మండలం తిర్మన్‌పల్లి నగేశ్, మద్నూర్‌లో అవినాశ్(22), బోధన్‌లో రేష్మ, గాంధారి మండలం ఉత్తనూర్కు చెందిన సహేందర్‌కు, మాచారెడ్డి మండలం పాల్వంచ లో సావిత్రికి ఈ వ్యాధి సోకింది. గత ఏడాది ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య రెండింతలు దాటింది. అవగాహన లోపం జిల్లాలో అతిగా వర్షాలు కురియడం, నీరు నిలి చి దోమలు పెరగడంతో దోమల ప్రభావం ఎక్కువగా ఉంది. ముందస్తుగానే ఈ వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు అవగాహన కల్పించాలి. కరపత్రాలు పంచాలి. నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించాలి. వీటిని పట్టించుకోకపోవడమే వ్యాధి తీవ్రతకు కారణమని తెలుస్తోంది. జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 సబ్‌సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. మలేరియా నివారణ శాఖ కూడా వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలు నామమాత్రమే. వ్యాధి బారినపడితే జిల్లాలో కూడా చికిత్స అందే అవకాశం లేదు. జిల్లా ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ ఎక్కించే యంత్రం ఉన్నా, వైద్యం అందడం లేదు. నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం -గోవింద్ వాగ్మారే, జిల్లా వైద్యాధికారి జిల్లాలో వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. డెంగీ ప్రభావం లేకుండా చూస్తున్నాం. ఇప్పటికే వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం.