కంఠేశ్వర్, న్యూస్‌లైన్: డెంగీ విజృంభిస్తోంది. భారీ వర్షాలు కురియడంతో గత ఏడాది కంటే ప్రస్తు తం ఈ వ్యాధి తీవ్రత పెరిగింది. వ్యాధి నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. రెండున్నర నెలలలోనే జిల్లాలో డెంగీ కేసులు 15కు చేరాయి. అధికారులు మాత్రం తప్పుడు నివేదికలు చూపుతున్నారు. జూన్ నెలలో జిల్లా కేంద్రంలో ఆసియాబేగం (34), బాన్సువాడ మండలం సంగోజీపేటలో మరొకరికి డెంగీ సోకినట్లు నిర్ధారించారు. జులై నెలలో తాడ్వాయి మండలం తిమ్మక్‌పల్లిలో శంకర్ (28), విష్ణు (4), మాక్లూర్ మండలం ముత్యంపల్లిలో సంగీత (22) ఈ వ్యాధి బారినపడ్డారని చెబుతున్నారు.
వీరు కాక మరికొందరి కి డెంగీ సోకినా వైద్య శాఖ నివేదికలో మాత్రం వారి గురించి పేర్కొన లేదు. నాగిరెడ్డిపేటలో ఒక టీచర్, లింగంపేట మండలం భవానిపేటకు చెందిన సందీప్ (22) బోధన్‌కు చెందిన ముగ్గురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. డిచ్‌పల్లి మండలం తిర్మన్‌పల్లి నగేశ్, మద్నూర్‌లో అవినాశ్(22), బోధన్‌లో రేష్మ, గాంధారి మండలం ఉత్తనూర్‌కు చెందిన సహేందర్‌కు, మాచారెడ్డి మండలం పాల్వంచ లో సావిత్రికి ఈ వ్యాధి సోకింది. గత ఏడాది ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య రెండింతలు దాటింది.
అవగాహన లోపం
జిల్లాలో అతిగా వర్షాలు కురియడం, నీరు నిలి చి దోమలు పెరగడంతో దోమల ప్రభావం ఎక్కువగా ఉంది. ముందస్తుగానే ఈ వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకు అవగాహన కల్పించాలి. కరపత్రాలు పంచాలి. నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించాలి. వీటిని పట్టించుకోకపోవడమే వ్యాధి తీవ్రతకు కారణమని తెలుస్తోంది. జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 సబ్‌సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. మలేరియా నివారణ శాఖ కూడా వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలు నామమాత్రమే. వ్యాధి బారినపడితే జిల్లాలో కూడా చికిత్స అందే అవకాశం లేదు. జిల్లా ఆస్పత్రిలో ప్లేట్‌లెట్స్ ఎక్కించే యంత్రం ఉన్నా, వైద్యం అందడం లేదు.
నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం
-గోవింద్ వాగ్మారే, జిల్లా వైద్యాధికారి
జిల్లాలో వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. డెంగీ ప్రభావం లేకుండా చూస్తున్నాం. ఇప్పటికే వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం.
కలవరపెడుతున్న డెంగీ
Published Fri, Aug 16 2013 4:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement