డెంగీ లక్షణాలతో విద్యార్థి మృతి
చిలకలూరిపేటటౌన్: డెంగీ లక్షణాలతో విద్యార్థి మృతిచెందిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలో సోమవారం జరిగింది. విద్యార్థి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు... పట్టణంలోని 25వ వార్డు పరిధిలోని అడ్డరోడ్డు సెంటర్‌లో నివాసం ఉండే బలగం కిషోర్ కుమారుడు బలగం జగదీష్ (16) జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఈ నెల 8వ తేదీన జ్వరం, వళ్లు నొప్పులు, విపరీతమైన తలనొప్పి వంటి డెంగీ లక్షణాలతో బాధపడుతుండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన స్థానిక వైద్యులు ప్లేట్‌లెట్‌లు 11 వేలకు పడిపోయాయని, విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, గుంటూరు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. వెంటనే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీష్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విద్యార్థి తండ్రి బలగం కిషోర్ పౌండ్రీవర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. తల్లి లత గృహిణి. తమ్ముడు అఖిల్ ఏడో తరగతి చదువుతున్నాడు. చిన్న వయస్సులోనే జగదీష్ మృతి చెందడటంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ ఇంటి సమీపంలో ఏర్పడిన అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా దోమల సంచారం పెరగటం వలననే తమ బిడ్డ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం వల్లే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ గోపినాయక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మర్రిరాజశేఖర్ పరామర్శ....
జగదీష్ మతి చెందిన విషయం తెలుసుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్ అతని నివాసానికి చేరుకొని నివాళి అర్పించారు. విద్యార్థి తాతయ్య బలగం రాఘవయ్య, తండ్రి కిషోర్ ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో 25వ వార్డు కౌన్సిలర్ షేక్ నాగుల్‌మీరా, మున్సిపల్ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ షేక్‌అబ్దుల్ రౌఫ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్‌అబ్దుల్లా , పార్టీ నాయకులు అనంతవీరరాఘవులు, బైరా వెంకటకోటి, గేరాలింకన్ తదితరులు ఉన్నారు.