రెండేళ్లకే నూరేళ్లు
రెండేళ్లకే నూరేళ్లు
Published Thu, Sep 29 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
గుడివాడలో డెంగీతో చిన్నారి మృతి
గుడివాడ టౌన్:
డెంగీ జ్వరం గుడివాడ పట్టణంలో తిష్ట వేసింది. గతవారం రోజుల్లో మూడు మరణాలు సంభవించటం ఇందుకు నిదర్శనం. స్థానిక ధనియాల పేటకు చెందిన ఎస్‌కె దోష్ బీ (2) అనే చిన్నారి బాలిక డెంగీ వాధితో గురువారం మృతి చెందింది. పోయిన గురువారం జ్వరం గమనించిన తల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శనివారం పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు డెంగ్యీ సోకిందని బుధవారం ప్లేట్‌లెట్స్ ఎక్కించారు. అయినప్పటికి ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం చిన్నారికి నూరేళ్లు నిండాయి. ఈ పాపకు ఇటీవలే తల్లిదండ్రులు రెండో పుట్టినరోజును ఘనంగా జరిపారు. అంతలోనే విగతజీవిగా మారడం కన్నవారితో పాటు బంధుమిత్రుల్ని తీవ్ర విషాదం నింపింది.
పారిశుధ్య లేమితో దోమల బెడద
పట్టణంలో పారిశుధ్య లోపం వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా దోమలు బాధిస్తున్నాయని, బురదరోడ్లు, మురుగునీటి వల్ల వాటి బెడద సమస్యగా మారిందని వాపోయారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. పట్టణంలో జ్వరాలు ఇంటింటినీ వేధిస్తున్నా వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు.
Advertisement