వణికిస్తున్న డెంగీ
వణికిస్తున్న డెంగీ
Published Sat, Aug 20 2016 10:46 PM | Last Updated on Sat, Aug 25 2018 6:52 PM
జిల్లాలో ఇద్దరు మృతి
అవనిగడ్డ ప్రాంతంలో మరో 20 అనుమానిత కేసులు
విజయవాడ (లబ్బీపేట) :
డెంగీ జ్వరాలు ప్రజలను వణికిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవనిగడ్డ మండలం కొత్తపేటకు చెందిన గరికిపాటి పోతురాజు, చాట్రాయి మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన మందపాటి ప్రసాదరెడ్డి ఎన్‌ఆర్‌ఐ డెంగీ జ్వరంతో మృతిచెందారు. అవనిగడ్డ ప్రాంతంలో మరో 20 మంది వరకూ డెంగీ అనుమానిత బాధితులు ఉన్నట్లు అధికారిక వర్గాలు చెపుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో సైతం డెంగీ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. ఉయ్యూరు మండలం కాటూరుకు చెందిన ఓ వ్యక్తికి వారం రోజుల క్రితం డెంగీ జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా పదుల సంఖ్యలో బాధితులు కార్పొరేట్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
పుష్కర విధుల్లో వైద్య సిబ్బంది
జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తుండగా వైద్య శాఖ సిబ్బంది అంతా పుష్కర విధుల్లో నిమగ్నమయ్యారు. దీంతో జ్వరం వచ్చినా చికిత్స చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. ప్రతి పీహెచ్‌సీలో ఒకరిద్దరు ఏఎన్‌ఎంలు మాత్రమే ఉంటున్నారు. దీంతో జ్వర బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు.
అప్రమత్తతే మందు
ఎడిస్ ఈజిప్ట్ ఐ అనే దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగీ జ్వరాలకు సంబంధించి అప్రమత్తతే నివారణకు మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిపై ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఫ్లవర్‌వాజ్‌లలో నిల్వవున్న మంచినీటిలో దోమ లార్వా వృద్ధి చెందుతుందని చెపుతున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఈ దోమ వృద్ధి చెందితే అక్కడ పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు తేలికపాటి ఆహారం, ద్రవపదార్ధాలు, తాజా పళ్లరసాలు తీసుకోవడం ద్వారా జ్వరప్రభావం ఎక్కువగా లేకుండా చూడవచ్చునని సూచిస్తున్నారు.
డెంగీ ప్రమాదమా ?
డెంగ్యూ జ్వరం 95 శాతం మందిలో సాధారణ జ్వరంలా సోకి తగ్గిపోతుందని నిపుణులు చెపుతున్నారు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొందరికి మామూలు పారాసెట్మాల్ టాబ్లెట్‌కి తగ్గిపోతుందని చెపుతున్నారు. ప్లేట్‌లెట్స్ తగ్గిన వారికి ప్రాణాంతకంగా మారుతుందంటున్నారు. జ్వరం తగ్గిన వారం రోజులకు కూగా శరీరంలో డెంగీ యాంటీ బాడీస్ ఉండడంతో ప్లేట్‌లెట్స్ తగ్గే అవకాశం ఉంది.
వీరికి సోకితే ప్రమాదమే
దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి డెంగీ జ్వరం సోకితే ప్రమాదకరంగా మారుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువుగా ఉన్న చిన్నపిల్లలకు సోకితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వారు డెంగీ జ్వరమని నిర్ధారణ అయిన వెంటనే మెరుగైన వైద్యం పొందాల్సి ఉంది.
అనుమానిత కేసులు నమోదు
జిల్లాలో అక్కడక్కడా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు అధికారికంగా 20 కేసులు నమోదయ్యాయి. కాగా ర్యాపిడ్ టెస్ట్ చేసి ఎన్‌ఎస్‌వీ పాజిటివ్‌గా రిపోర్టు ఇస్తున్నారు. దానిని డెంగీగా పరిగణించలేం. ఒక్క ఎలిసా పరీక్ష ద్వారా నిర్ధారణ అయితేనే డెంగీగా పరిగణిస్తాం. అవనిగడ్డలో ప్రత్యేక శిబిరం పెట్టి జ్వరాలు ఉన్న వారి రక్తం నమూనాలు సేకరించనున్నాం. నగరంలో సైతం అక్కడక్కడ జ్వరం కేసులు నమోదవుతున్నాయి.
– ఆదినారాయణ, జిల్లా మలేరియా అధికారి
Advertisement
Advertisement