నగరంలో డెంగీ భయం
మధురానగర్‌లో చిరుద్యోగి మృతి
మధురానగర్:
నగరంలో చాప కింద నీరులా డెంగీ విస్తరిస్తోంది. మధురానగర్ 45వ డివిజన్ సాయిబాబా కాలనీ నాలుగోలైనుకు చెందిన రంగాల రమేష్‌బాబు (49) అనే వ్యక్తి గురువారం డెంగీ జ్వరంతో ప్రాణాలొదిలారు. రమేష్ బాబు ఒక పాదరక్షల షోరూమ్‌లో చిరుద్యోగి. నాలుగు రోజుల క్రితం పుష్కరస్నానం చేశారు, వెంటనే జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం పెరగడంతో బుధవారం ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు డెంగీ గా నిర్ధరించారు. రక్తంలో ప్లేట్‌లెట్‌లు తగ్గిపోయాయని వైద్యులు చెప్పారు. గురువారం పరిస్థితి విషమించటంతో మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవటంతో వారి ఆర్తనాదాలు చూపరులను కంటతడిపెట్టించాయి. అసలే దోమలకు నిలయమైన మధురానగర్‌లో డెంగీతో మృతిచెందటంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డివిజన్‌లో విషజ్వరాలు, దోమల నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.