కొత్తవుడియంలో కాలువలు పరిశీలిస్తున్న అధికారులు
బి.కొత్తకోట: మండలంలోని బడికాయలపల్లె పంచాయతీ కొత్తవుడియంలో డెంగీ వ్యాధి వెలుగుచూసింది. దీనితో వైద్యాధికారులు సోమవారం అప్రమత్తం అయ్యారు. కొత్తవుడియంకు చెందిన మేఘన(7)కు మూడురోజులుగా జర్వం రావడంతో స్థానిక, మదనపల్లెలో వైద్యం అందించారు. డెంగీ వ్యాధి సోకిందన్న అనుమానంతో తిరుపతి రుయా తరలించగా అక్కడ మేఘనకు పరీక్షలు నిర్వహించగా డెంగీ సోకినట్టు నిర్దారించారు. విషయం తెలుసుకొన్న మదనపల్లె డివిజన్ కార్యక్రమాల అమలు అధికారి టీ.మునిరత్నం, ఎంపీడీవో గంగయ్య, సర్పంచు జయచంద్రనాయుడు, కార్యదర్శి సిగ్బతుల్లా, వైద్యాధికారిణి గంగాదేవి, వైద్య సిబ్బంది కొత్తవుడియం చేరుకొన్నారు. మురికినీటి కాలువలను శుభ్రం చేయించారు. బ్లీచింగ్ చల్లించి, గ్రామస్తులకు జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగా కాలువలు పరిశీలించి ఇంకా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని, వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.