చిత్తూరు ప్రభుత్వఆస్పత్రిలో మాత్రల కోసం బాధితుల నిరీక్షణ
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరంతో వచ్చే బాధితులకు మూడు రోజులకు పది పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక్కో బాధితులకు ఆరు మాత్రలే ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే స్టాకు లేదంటున్నారు. ఇక రెండు నెలలుగా పారాసిటమాల్ మాత్రలు సరఫరా లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది బయటి మెడికల్ దుకాణాల్లో రూ.10 లక్షలు అప్పుచేసి మాత్రలు కొన్నారు. బాకీ తీర్చమని దుకాణ నిర్వాహకులు ఒత్తిడి తేవడంతో హెచ్‌డీఎస్ నిధుల నుంచి రూ.7 లక్షలు చెల్లించారు.’’
చిత్తూరు అర్బన్: ఇదొక్కటేకాదు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. రెండు నెలలుగా ప్రభుత్వం పారాసిటమాల్ మాత్రలను సరఫరానే చేయలేదు. ఫలితంగా రోజుకు సర్కారీ ఆస్పత్రికి వచ్చే చాలామంది జ్వరబాధితులకు పారాసిటమాల్ మాత్రలు లేవని చెబుతున్న సిబ్బంది రోగులనుతిప్పి పంపించేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో కలిపి రోజుకు జ్వరంతో వచ్చేవారి సంఖ్య పది వేల వరకు ఉంటుంది. ఒక్కసారి జ్వరంతో వచ్చే బాధితులను పరిశీలించిన వైద్యులు సూదిమందు వేయడంతో పాటు పది పారాసిటమాల్ మాత్రలను రాసిస్తారు. వీటిని మూడు రోజుల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు రోజులకే మాత్రలు ఇస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి
మాత్రలు, సూది మందులు, సిరప్‌లాంటి వాటిని రాష్ట్ర వైద్యశాఖ సరఫరా చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)కు టెండర్లను అప్పగించి ప్రతి జిల్లాకు కావాల్సిన మందులను తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు (సీడీఎస్) పంపిణీ చేస్తారు. జిల్లా నుంచి ప్రతి వైద్యశాలకు ఏయే మందులు కావాలని ఈ–ఔషధి ద్వారా ఆన్‌లైన్‌లో అడిగితే వాటిని తిరుపతిలోని డ్రగ్‌స్టోర్ నుంచి తీసుకోవచ్చు. సంవత్సరంలో నాలుగుసార్లు మందుల జాబితాను ఈ–ఔషధి ద్వారా తీసుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు మూడు నెలలకు ఓసారి మందుల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచి సీడీఎస్ నుంచి వీటిని తీసుకుంటారు. జిల్లాకు జనవరిలో పారాసిటమాల్ మాత్రలు ఇచ్చిన ప్రభుత్వం దాని తరువాత ఇప్పటివరకు సరఫరాను ఇవ్వలేదు. గతనెల సీడీఎస్‌లో మిగిలిన మాత్రలను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సర్దేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఒక్కటంటే ఒక్క పారాసిటమాల్ మాత్ర సీడీఎస్‌లో నిల్వలేకపోవడం ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కనీసం నెల రోజులకు పారాసెట్‌మాల్ మాత్రలను జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో రిజర్వులో ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు జిల్లాకు 60 లక్షల పారాసిటమాల్ మాత్రల కొరత ఉంది.
కొనుగోలుకు నిధులేవీ?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందుల కొనుగోలుకు డీసెంట్రలైజ్డ్ లోక్ పర్‌చేస్ డ్రగ్స్ బడ్జెట్‌ను ప్రతి మూడు నెలలకోసారి విడుదలచేయాలి. ఒక్కో ఆస్పత్రికి 10 శాతం నిధులను ఆయా ఆస్పత్రుల పర్యవేక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. వీటితో అవసరమైన మందులను కొనుగోలు చేసుకుంటూ రోగులకు ఇబ్బందిలేకుండా అధికారులు జాగ్రత్త తీసుకుంటారు. అయితే ఏడాది కాలంగా ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇలాగైతే కష్టమని ప్రశ్నిస్తున్న వైద్యులకు ఓ ఉచిత సలహా ఇస్తున్నారు. మెడికల్ దుకాణాల్లో అప్పులు చేయమని చెబుతున్నారు. విధిలేక ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు రూ.లక్షల్లో అప్పులు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment