డెంగీ పడగ
Published Tue, Sep 20 2016 1:12 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో డెంగీ జ్వరాలు పడగ విప్పాయి. ప్రతిచోట ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. అధికారులు మాత్రం ఇప్పటివరకూ మూడు కేసులు మాత్రమే నమోదైనట్టు చూపిస్తున్నారు. అనధికారికంగా వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. జిల్లాలోని అనేక ఆసుపత్రుల్లో డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఏజెన్సీలో ప్రమాదకరమైన కాళ్లవాపులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొయ్యలగూడెంలో ఇద్దరు
తాజాగా కొయ్యలగూడెం మండలంలో ఇద్దరు డెంగీబారిన పడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారు చికిత్స పొందుతున్నారు. కొయ్యలగూడెంకు చెందిన ఎస్‌కే హసీనా డెంగీ లక్షణాలతో రాజమండ్రిలో చికిత్స పొందుతోంది. వీఎస్‌ఎన్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హసీనాకు వారం రోజుల క్రితం జ్వరం, తలపోటు రావడంతో పరీక్షలు నిర్వహించారు. డెంగీ లక్షణాలు కనబడటంతో ఆమెను రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్లేట్‌లెట్స్ 80 వేలకు పడిపోయాయని, ఆమెకు డెంగీ వ్యాధి సోకినట్టు డాక్టర్లు నిర్థారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే మండలంలోని కన్నాపురానికి చెందిన తెలిపేట రామిరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి అనే గిరిజన యువకునికి 15 రోజులుగా చికిత్స అందిస్తున్నా జ్వరం తగ్గకపోవడంతో తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిం చారు. అతనికి కూడా డెంగీ లక్షణాలు బయటపడ్డాయి. ప్లేట్‌లెట్స్ 30వేలకు పడిపోయాయి. సందీప్‌రెడ్డి వైజాగ్‌లో ఎంబీఏ చదువుతున్నట్టు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీహెచ్‌ఈవో జి.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి కన్నాపురంలో సోమవారం సర్వే చేపట్టారు.
‘్రౖపైవేట్’ దోపిడీ
తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన రోగికి డెంగీ లక్షణాలు కనిపిస్తే కనీసం రూ.50వేలకు పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్లేట్‌లెట్స్ ఎక్కించడానికి డోసుకు కనీసం రూ.10 వేలు ఖర్చవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా ప్లేట్‌లెట్స్ ఎక్కించే సౌకర్యాలు లేవు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అధికారులు మూడు డెంగీ కేసులే ఉన్నాయని చెబుతున్నా.. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ సంస్థ నివేదికల ప్రకారం చూస్తే వందమందికి పైగా జ్వర పీడితుల్లో డెంగీ లక్షణాలు ఉన్నట్టు వెల్లడైంది.
ఏజెన్సీలో కాళ్లవాపులు
ఏజెన్సీ ప్రాంతంలో జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కాళ్లు విపరీతంగా వాచిపోతున్నాయి. అరికాళ్లతోపాటు శరీరమంతా విపరీతమైన నొప్పులు ఉండటంతో బాధితులు నడవడం కూడా ఇబ్బందికరంగా ఉంటోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో కాళ్లవాపులతో పలువురు మృత్యువాత పడటంతో కాళ్లవాపులు వచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. వాపులతో బాధపడుతున్నవారు స్థానికంగా మందులు వాడుతున్నా ఏ మాత్రం ప్రయోజనం లేకుండాపోతోంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ వీటిపై దృష్టి పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
Advertisement
Advertisement