వర్ధమాన క్రికెటర్‌ను బలిగొన్న డెంగీ
బోడుప్పల్: వర్ధమాన క్రికెట్ క్రీడాకారుడిని డెంగీ కబళించింది. క్రికెట్‌లో రాణిస్తున్న బోడుప్పల్ శ్రీసాయినగర్ కాలనీకి చెందిన సాయి విశ్వనాథ్‌రాజు(17) గురువారం రాత్రి డెంగీ జ్వరంతో మరణించాడు. వివరాలివీ... బోడుప్పల్ శ్రీసాయినగర్‌కాలనీలో నివసించే బుద్ధరాజు సీతారామరాజు, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు. సీతారామరాజు సంగారెడ్డిలోని యూబీ కంపెనీలో ఎలక్ట్రీషియన్. పెద్ద కుమారుడు సాయి విశ్వనాథ్‌రాజు(17) సైనిక పురిలోని భవన్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క్రికెట్‌లో రాణిస్తున్నాడు. వారం క్రితం ఇతడికి జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రిలో చూపించుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో రెండు రోజుల క్రితం పీర్జాదిగూడలోని స్పార్క్ హాస్పిటల్‌లో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా డెంగీ అని తేలడంతో చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి సాయి విశ్వనాథ్‌రాజు మృతి చెందాడు. శుక్రవారం భవన్స్ కాలేజీ విద్యార్థులు, తోటి క్రికెట్ టీం సభ్యులు విశ్వనాథ్ రాజు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎనిమిదేళ్ల వయసు నుంచే క్రికెట్..
సాయి విశ్వనాథ్‌రాజు చిన్నతనం నుంచి క్రికెట్‌పై ఆసక్తి చూపేవాడని, దీంతో 8 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడని మృతుడి తండ్రి సీతారామరాజు, కోచ్ సురేష్ తెలిపారు. ఇప్పటి వరకు స్కూల్ లెవెల్‌లో రంగారెడ్డి జిల్లాలో, అండర్ 16 ఏ డివిజన్ లెవెల్‌లో ఆడాడు. ఇటీవల నేషనల్ లెవెల్‌లో ఢిల్లీ, గోవాలో వైస్ కెప్టెన్ గా ఆడగా బెస్ట్‌అవార్డుతోపాటు మేన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టుడే లీగ్ మ్యాచ్‌లు 19 ఆడాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడని, ఇంతలో డెంగీ రూపంలో సాయివిశ్వనాథ్‌రాజును మృత్యువు కబళించిందన్నారు.