సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలతో పాటు పోలీసులు కూడా సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా మారారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగ దీక్షకు అనుమతిచ్చి చివరి నిమిషంలో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్లలోనే మేం దీక్ష చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ నిర్లక్ష్యంతోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు.
చదవండి: కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్‌కు కోర్టు ఆదేశం
ప్రతి మంగళవారం చేపట్టే నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం బోడుప్పల్‌లో దీక్షకు యత్నించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి రవీంద్ర నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమకారుడు చనిపోతే పరామర్శించడానికి ప్రభుత్వం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్ర నాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాడని గుర్తుచేశారు. పోరాటానికి దక్కిన ఫలితం చివరకు ఆత్మహత్య అని వాపోయారు. ఇది హత్యనా? ఆత్మహత్యనా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. కేవలం కేసీఆర్ నిర్లక్ష్యంతోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి యువతను మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కొత్త రాగం అందుకుని గర్జనలు చేస్తోందని, చంద్రబాబు సలహా ఇచ్చారా? కేసీఆర్ అనుమతి ఇచ్చారా? అని ప్రశ్నించారు. మీ లోక్‌సభ పరిధిలోనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం గుర్తించరా? అని నిలదీశారు. ఆ కుటుంబానికి కనీసం భరోసా ఇవ్వలేని మీరు ఒక ఎంపీయేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి..
ఇన్నాళ్లు అమ్ముడు పోయి.. ఇప్పుడు గర్జనలు, దీక్షలు చేస్తామంటే మిమ్మల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీలు తొత్తులుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. టీపీసీసీ అంటేనే టీఆర్ఎస్ ప్యాకెట్‌లో కాంగ్రెస్ కమిటీ అని అభివర్ణించారు. తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలు వేసే వరకు పోరాటాలు చేస్తుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు పోలీసులు కూడా కేసీఆర్‌కు తొత్తులుగా మారారని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చుని దీక్ష చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment