సాక్షి,బోడుప్పల్(హైదరాబాద్): బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గత కొంత కాలంగా అధికారులు లేకుండా పాలన కొనసాగుతుంది. ఇక్కడ పని చేసే అధికారులు కొంత మంది ఇష్టం లేక వెళ్లి పోవడం, మరి కొంత మంది సెలవులపై వెళ్లడంతో కిందస్థాయి సిబ్బందిచే పాలన కొనసాగిస్తున్నారు. అధికారులపై విపరీతమైన ఒత్తిడి, పనిభారంతో పాటు వేధింపులు ఉండడంతో ఇక్కడ పని చేయడానికి ఏ అధికారి ఇష్ట పడడం లేదు. దీంతో ఇప్పటికే కమిషనర్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, మేనేజర్, హరితహారం ఇన్‌చార్జ్ లేకుండానే తూతూ మంత్రంగా పాలన కొనసాగిస్తున్నారు.
పాలనాధ్యక్షుడైన మేయర్‌కు అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మేయర్‌కు ప్రజా పాలనపై పట్టు లేకపోవడం, ఇతర విషయాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై చూపకపోవడంతో పాలన పూర్తిగా స్తంభించిపోతోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే డిప్యూటేషన్‌పై పనిచేసే అధికారులు ఇక్కడ పని చేయకపోగా, మరి కొంత మంది అధికారులు బదిలీ అయ్యారు. కమిషనర్ కూడా సెలవులపై వెళ్లడంతో నగర పాలక సంస్థలో పాలన అటకెక్కింది.
సమన్వయ లోపం కారణమా?
► బోడుప్పల్ కమిషనర్, మేయర్‌కు మధ్య సమన్వయం లోపించింది. దీంతో గత కొంత కాలంగా వారు ఎడ,పెడ మొఖంగా ఉన్నారు. దీంతో పాటు పనిభారంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన సెలవులపై వెళ్లారు. ఇక్కడ పని చేసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ పదవీకాలం ముగిసింది. అనంతరం ఆయననే మళ్లీ అవుట్ సోర్సింగ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా తీసుకున్నారు. ఆయన కొంత కాలం పని చేసిన తర్వాత ఇక్కడ చేయలేనని వెళ్లిపోయారు. ఆ తర్వాత కొత్తగా మరో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాలేదు. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొంది స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్‌లో అవార్డులు పొందిన బోడుప్పల్ నేడు చెత్త విషయంలో మురికి కూపంగా మారింది. ఇక్కడ పని చేసిన మేనేజర్ మరో చోటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవడంతో ఆర్‌ఓను ఇన్‌చార్జ్ మేనేజర్‌గా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు.
ఇలా వస్తారు.. అలా వెళ్తారు..
► మున్సిపాలిటీకి కీలకమైన విభాగం టౌన్‌ప్లానింగ్. ఇక్కడ గతంలో నల్గొండలో పనిచేసే ఓ ఏసీపీ అధికారి డిప్యూటేషన్‌పై మూడు రోజులు ఇక్కడ, మరో మూడు రోజులు అక్కడ పని చేశారు. ఓ మంత్రి సహకారం మేయర్, కొంత మంది కార్పొరేటర్లు భవన నిర్మాణాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఆయన తన డిప్యూటేషన్‌ను రద్దు చేయించుకుని నల్గొండలోనే ఉండి పోయారు. ఆయన తరువాత మరో టీపీఓ డిప్యూటేషన్‌పై వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఇమడ లేక వెళ్లిపోయారు. ప్రస్తుతం అధికారి లేకుండానే టౌన్ ప్లానింగ్ విభాగం కొనసాగుతోంది.
కిందిస్థాయి అధికారులతోనే..
► ప్రతి సంవత్సరం హరితహారం కోసం బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ, మొక్కల పంపిణీ, పార్కుల ఏర్పాటు, నిర్వహణ, పెరటి తోటల పంపకం, మొక్కలకు నీటి సరఫరా, నర్సరీల ఏర్పాటు, నిర్వహణ కోసం పదవీ విరమణ పొందిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్‌ను నెలకు రూ. 50 వేలు ఇచ్చి తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన సదరు అధికారి సైతం పని చేయలేమని వెళ్లిపోయారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే అందుకు ఎవరూ సాహసించడం లేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగం మినహా ఇస్తే మిగతా విభాగాలు కింద స్థాయి అధికారులు, సిబ్బందిచే నడుపుతున్నారు. దీంతో పాలన అంతా స్తంభించి పోయి అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చదవండి: కరీంనగర్‌లో మరో ‘పుష్ప’ భన్వర్‌సింగ్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment