మేడ్చల్: ఏళ్ల క్రితం చట్ట ప్రకారంగా కొనుగోలు చేసిన భూముల్లో వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఫిర్యాదుతో వారి స్థలాలు వక్ఫ్ భూములని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ సమస్యలను పట్టించుకోవాలని మేడ్చల్ బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 30 కాలనీల ప్రజలు 85 మందితో అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి నిరసన తెలిపారు. బోడుప్పల్ ప్రాంతంలో ఆర్‌ఎన్‌ఎస్ కాలనీ, పెంటారెడ్డి కాలనీ,ç మారుతీనగర్, ఘట్‌కేసర్‌కు చెందిన మధురానగర్ తదితర 30 కాలనీల ప్రజలు నాలుగేళ్లుగా విచిత్ర సమస్యను ఎదుర్కొంటున్నారు.
బోడుప్పల్ ప్రాంతంలో 30 సర్వే నంబర్లలో 300 ఎకరాలు, ఘట్‌కేసర్ పరిధిలో 10 ఎకరాలు భూమి ఉంది. 40 ఏళ్ల క్రితం అవన్నీ వెంచర్లుగా మారిపోయాయి. బోడుప్పల్, పిర్జాదీగూడ నగర శివారు ప్రాంతాలు కావడంతో శరవేగంగా అభివృద్ధి సాధించాయి. రియల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేశారు. చట్టబద్ధంగా వినియోగదారులకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ప్లాట్లు కొనుగోలు చేసి సొంతింటి కల నెరవేర్చుకున్నారు. దాదాపు 30 కాలనీలలో ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి.
2018 వరకు అంతా సాఫీగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. 2018లో ఓ వ్యక్తి కాలనీలు ఉన్న భూములన్నీ వక్ఫ్ భూములని ఫిర్యాదు చేయడంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీంతో 7వేల కుటుంబాల వారు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలు పెట్టారు. 2022 సంవత్పరంలో 30 కాలనీల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడంతో కాలనీలలో ఇల్లు కట్టుకున్న వారి భవిష్యత్ అంధకారంగా మారంది.
జేఏసీ తరపున పోరాటాలు చేసినా పాలకుల నుంచి, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారి రోదన అరణ్య రోదనగా మారింది. తమ సమస్యను ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఎవరికి విన్నవించుకున్నా పరిష్కారం కాకపోవడంతో వారు తమ సమస్యపై పాలకులు స్పందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా 88 నామినేషన్లు వేశారు. శుక్రవారం కాలనీల వాసులు కీసరలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 116 మంది నామినేషన్లు వేయగా అందులో 88 మంది బోడుప్పల్ 30 కాలనీలకు చెందిన వారే.
ప్రభుత్వానికి మా సమస్య తెలియాలనే..
మేం ఎన్నికలలో విజయం సాధిస్తామని నామినేషన్ వేయలేదు. మా సమస్య వచ్చే ప్రభుత్వానికి తెలియాలనే మూకుమ్మడి నామినేషన్లు వేశాం. ఎన్నికల ద్వారానైన మా సమస్య ప్రభుత్వం దృష్టికి పోతుందని అనుకుంటున్నాం. – శ్రీధర్‌రెడ్డి, ఐక్యకార్యాచరణ సమితి అధ్యక్షుడు
పాలకులు పట్టించుకోవడం లేదు..
పాలకులు పట్టించుకోకపోవడం వల్లే 88 మంది నామినేషన్లు వేశారు. సమస్యను మంత్రి మల్లారెడ్డికితో పాటు అందరు పాలకులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. మా సమస్య పట్టించుకోని నేతలకు ఓటు ద్వారా బుద్ది చెబుతాం – కుంభం కిరణ్‌కుమార్, కార్పొరేటర్, జేఏసీ కోచైర్మన్
Comments
Please login to add a commentAdd a comment