సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున బీజేపీ అధిష్టానం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా గందరగోళానికి దారితీసింది. తీవ్ర కసరత్తు అనంతరం శుక్రవారం 14 మంది అభ్యర్థులతో చివరి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. ఇందులో 11 మంది కొత్తవారు కాగా.. మిగతా నలుగురు మార్పులతో టికెట్ దక్కించుకున్నవారు. కానీ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఐదో జాబితాలోని మూడు చోట్ల అభ్యర్థులను మార్చడం గందరగోళానికి తెరలేపింది.
- ఇటీవల వేములవాడ నుంచి తుల ఉమ పేరును ప్రకటించిన బీజేపీ అధిష్టానం అనూహ్యంగా బీఫాంను చెన్నమనేని వికాస్‌రావుకి ఇచ్చింది.
- సంగారెడ్డి నుంచి దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు పేరును ఐదో జాబితాలో ప్రకటించినా.. అక్కడ పులిమామిడి రాజుకు బీఫాం అందింది.
- బెల్లంపల్లి (ఎస్సీ) నుంచి తొలి జాబితాలో సీటు పొందిన అమరాజుల శ్రీదేవిని మారుస్తూ.. కొయ్యల ఏమాజీ పేరు ప్రకటించారు. కాసేపటికే మళ్లీ అమరాజుల శ్రీదేవినే బరిలో ఉంటారని ప్రకటించి బీఫామ్ ఇచ్చారు.
- ఐదో జాబితాలో అలంపూర్ నుంచి మారెమ్మ బరిలో ఉంటారని చెప్పినా.. సాయంత్రానికి మార్చేసి, రాజగోపాల్ పేరు ప్రకటించారు.
- చాంద్రాయణగుట్టలో సత్యనారాయణ ముదిరాజ్‌కు బదులు కె.మహేందర్‌ను ఎంపిక చేశారు.
- మూడో జాబితాలో వనపర్తికి అశ్వత్థామరెడ్డి పేరు ప్రకటించగా.. తాజా జాబితాలో అనుజ్ఞారెడ్డిని అక్కడ బరిలో దింపారు.
- ఐదు జాబితాల్లో కలిపి మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. 111 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా మిగతా 8 స్థానాల్లో జనసేన బరిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment