డెంగీ జ్వరాల బారిన పడి కోలుకున్న అశోక్‌కుమార్, నందిత
వణికిస్తున్న విష జ్వరాలు
Published Wed, Jul 27 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
–టెక్కలి కోదండరామ వీధిలో జ్వరాల విజృంభణ
–ఇప్పటికే నలుగురికి డెంగీ జ్వరాలుగా నిర్ధారణ
– ప్రైవేట్ ఆస్పత్రులే దిక్కు
–కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపమే కారణం!
డివిజన్ కేంద్రమైన టెక్కలిలోని కోదండరామవీధిలో విష జ్వరాలు విజృంభించాయి. ఈ దళిత వాడలో ఇంటికొకరు చొప్పున విష జ్వరాల బారిన పడ్డారు. ఇప్పటికే ఇద్దరు చిన్నారులతో పాటు ఇద్దరు యువకులు డెంగీ భారిన పడ్డారు. ప్రాణాలు దక్కించుకోవడానికి వేలాది రూపాయలు అప్పులు చేసి ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించారు.
టెక్కలి : విష జ్వరాలు విజృంభించడంతో టెక్కలిలోని దళితవాడ కోదండరామ వీధి గజగజలాడుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఎం.నందిత, ఎం.ఉదయ్, వారి మేనమామ వై.అశోక్‌కుమార్ డెంగీ బారిన పడ్డారు. ఇక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. మరో యువకుడు ఆర్.దుర్గారావు ప్రస్తుతం డెంగీ జ్వరంతో పలాసలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరితో పాటు పర్రి వెంకటేష్, యడ్ల వెంకటేష్, టి.రాజ్‌కుమార్, ఎస్.కళ్యాణ్, నీలవేణి, నాగేంద్ర, టి.సోమేశ్వరరావు, టి.పార్వతమ్మ, టి.మోహిని తదితరులు మంచం పట్టారు. విష జ్వరాలతో ప్రస్తుతం కోదండరామవీధి వాసులు ఆందోళన చెందుతున్నారు.
క్షీణించిన పారిశుద్ధ్యం..
కోదండరామవీధిలో విష జ్వరాల విజృంభణకు పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరే కారణమని స్థానికులు చెబుతున్నారు. వీధిలో పారిశుదం్ధ్య పనులు చేపట్టాలని పలుమార్లు పంచాయతీ యంత్రాంగానికి విన్నవించినా స్పందించలేదని స్థానికుడు బి.ధనుంజయరావు ‘సాక్షి’ వద్ద వాపోయాడు. వీధిలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నా కూత వేటు దూరంలో ఉన్న వైద్య సిబ్బంది కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Advertisement
Advertisement