అర్హత లేని వైద్యం ఎలా చేస్తారు? | DMHO Bandaru Subramanyeshwari Visit Hospital | Sakshi
Sakshi News home page

అర్హత లేని వైద్యం ఎలా చేస్తారు?

Published Wed, Dec 12 2018 11:46 AM | Last Updated on Wed, Dec 12 2018 11:46 AM

DMHO Bandaru Subramanyeshwari Visit Hospital - Sakshi

తణుకు బాలాజీ హాస్పటల్‌లో వైద్యుడిని నిలదీస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి

పశ్చిమగోదావరి, తణుకు అర్బన్‌: స్థానిక రాష్ట్రపతి రోడ్డులోని ఓ హాస్పటల్‌ను మంగళవారం రాత్రి డీఎంహెచ్‌వో డాక్టర్‌ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గి చికిత్స పొందుతున్న జ్వర పీడితులను ఆరా తీయగా ఇప్పటివరకు వారు ఖర్చు చేసిన మొత్తాన్ని చెప్పిన వైనానికి డీఎంహెచ్‌వో నివ్వెరపోయారు. ఇదేంటి మీరు మత్తు వైద్యుడు కదా? జనరల్‌ ఫిజీషియన్‌ చేయాల్సిన వైద్యం మీరెలా చేస్తున్నారంటూ సదరు వైద్యుడు డాక్టర్‌ డి.బిల్లీగ్రహంను నిలదీశారు. ఇకపై మీరు ఎటువంటి వైద్య పరీక్షలు రాయడానికి వీల్లేదని, జనరల్‌ ఫిజీషియన్‌ను అందుబాటులో ఉంచుకుని మాత్రమే వైద్యం చేయాలని, లేదంటే ఆస్పత్రిని సీజ్‌ చేస్తానని హెచ్చరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బంధువులకు ఈ హాస్పిటల్‌ వైద్యుడు ఇటువంటి వైద్యం చేయకూడదని, మీరు ఏ వైద్యుడి వద్దకు వెళ్లాలో తెలుసుకుని వైద్యం చేయించుకుని నాణ్యమైన వైద్యాన్ని పొందాలని సూచించారు.

ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న జల్లి కొమ్మర గ్రామానికి చెందిన ఉప్పలపాటి దేవీ ప్రసన్న బంధువులు ఇప్పటివరకు రూ.62 వేలు ఖర్చయ్యిందని చెప్పడం విశేషం. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో డెంగీ పేరుతో కొన్ని ఆస్పత్రుల్లో అర్హతలేని వైద్యులు వైద్యం చేస్తూ ఇష్టానుసారంగా వైద్య పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం మండల జల్లి కొమ్మర గ్రామ వాసులకు ఈ హాస్పిటల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిందని, కొమ్మర వెళ్లి జ్వరాలపై పర్యవేక్షిస్తే ఈ హాస్పిటల్‌ వ్యవహారం తెలిసి వచ్చానని చెప్పారు. తీరా వచ్చి చూస్తే జనరల్‌ ఫిజీషియన్‌ లేకుండానే ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గిందని వైద్యం చేస్తుండటం బయటపడిందన్నారు.ఇటువంటి ఆస్పత్రులపై రానున్న రోజుల్లో తనిఖీలు చేయనున్నట్టు వివరించారు. ముందుగా తణుకులోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లను పర్యవేక్షించారు. ఆమె వెంట హెల్త్‌ యాక్సెంట్‌ ఆఫీసర్‌ ఎం.జగన్‌మోహన్‌రావు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలి
చాగల్లు: మార్కొండపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా ఆరోగ్యశాఖాధికారిణి డా.బి సుబ్రహ్మణ్యేశ్వరి మంగళవారం సందర్శించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని సిబ్బందికి సూచించారు. వైద్యులు డా. డి.ప్రభాకర్, డా.కె.నిషిత పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement