నీ మేనేజ్‌మెంట్ ఇదేనా
-
డీఎం అండ్ హెచ్‌ఓ పద్మజారాణిపై పూనం మాలకొండయ్య మండిపాటు
గుంటూరు మెడికల్ : ‘నీవు ప్రోగ్రామ్ చేయగలవా లేదా... నీ మేనేజ్‌మెంట్ ఇదేనా... నీ కమాండ్ ఏమీ బాగాలేదు’- అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య మండిపడ్డారు. గుంటూరు వైద్య కళాశాలలో సోమవారం స్వాస్థ్య విద్యావాహిని వాహనాలను పూనం మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా బ్యాడ్జీ, ఐఈసీ మెటీరియల్‌తో కూడిన బ్యాగ్‌లను అందజేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్యార్థులు సర్వే చేయాల్సిన అంశాలతో రూపొందించిన పత్రాలు బ్యాగ్‌లలో లేకపోవటాన్ని గమనించిన పూనం మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కార్యక్రమంపై అవగాహన కల్పించేలా రూపొందించిన బ్యానర్లు కట్టకపోవటం, సర్వే పత్రాలు బ్యాగ్‌లలో పెట్టకపోవటంతో డీఎం అండ్ హెచ్‌ఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే డీఎంహెచ్‌ఓ తన వద్ద ఉన్న ఓ సర్వే పత్రాన్ని వైద్య కళాశాలలో ఫోటోస్టాట్ కాపీలు తీయించి వైద్య విద్యార్థుల బ్యాగ్‌లలో పెట్టారు. ఉదయం ఏడుగంటల కల్లా వాహనాలు ప్రారంభం కావాల్సి ఉండగా 7.30 గంటల వరకు బయలు దేరకపోవటంతో వైద్యాధికారులకు పూనం మాలకొండయ్య క్లాస్ తీసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో పరిశీలించేందుకు ఆమె వైద్య విద్యార్ధుల వాహనాలతో పాటుగా వెళ్ళారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి, ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ డి.షాలినీదేవి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, ఎస్‌పీఎం వైద్య విభాగాధిపతి డాక్టర్ ఆర్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యానికి భరోసా కల్పించడమే ధ్యేయం
సత్తెనపల్లి: ప్రజల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త విధానానికి నాంది పలికిందని, రోగాలు వచ్చినప్పుడు వైద్యం చేసేకంటే రోగాలు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించి ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ పూనం మాలకొండయ్య ఆదేశించారు. సోమవారం ఆకస్మికంగా సత్తెనపల్లి వచ్చిన ఆమె చంద్రన్న సంచార వైద్యసేవల వాహనాలు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉండటంతో వాటిని పరిశీలించారు. అనంతరం సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామంలో స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించేలా స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. చంద్రన్న సంచార చికిత్స శిబిరాలు జరిగే రోజున గ్రామాల్లో స్వాస్థ్య విద్యావాహిని బృందాలు కూడా పర్యటిస్తాయన్నారు. నెలకో అంశంపై బృందాలు ప్రజలకు వివరిస్తాయన్నారు. మెడికోలు, నర్సింగ్ విద్యార్థులు, దంత వైద్య విద్యార్థులు, అసిస్టెంట్ సర్జన్ బృందంలో ఉంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వైద్య విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. ఈసందర్భంగా వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల,అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి చిన్నారులతో చేతుల శుభ్రత, తదితర వాటి పై మాట్లాడారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.