హెచ్‌ఐవీ బాధితులకు టీబీ పరీక్ష తప్పనిసరి
కర్నూలు(హాస్పిటల్): హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులకు తప్పనిసరిగా టీబీ పరీక్ష చేయించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. హెచ్‌ఐవీ, టీబీ మందులపై శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏఆర్‌టీ, టీబీ యూనిట్ల వైద్యసిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ, టీబీ రోగులకు ఏఆర్‌టీ థెరపి మందులు ఏఆర్‌టీ సెంటర్‌లోనే ఇస్తారన్నారు. గతంలో టీబీ రోగులకు ఆరు నెలలకు సరిపడా మందులు ఒకేసారి ఇచ్చేవారమని, ఇప్పుడు నెలకు ఒక బాక్స్ మాత్రమే ఇస్తున్నామన్నారు. ఇకపై ప్రతి నెలా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ.. టీబీ లేకుండా హెచ్‌ఐవీ ఉన్న వారు.. గతంలో ఏడు మాత్రలు మింగేవారని, ఇప్పుడు ఏడు మందులు కలిపి రెండు మాత్రలుగా చేశారన్నారు. రెండు మాత్రలను చించిన తర్వాత ఫోన్ నెంబర్ ఉంటుందని, ఆ ఫోన్ నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తేనే వారు మింగినట్లు ఆన్‌లైన్‌లో నమోదవుతుందన్నారు. ఎవరైనా ఫోన్ చేయకపోతే వారి ఇంటికి సిబ్బంది వెళ్లి మందులు మింగేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో(ఎయిడ్స్ అండ్ లెప్రసి) డాక్టర్ రూపశ్రీ, డీఐవో డాక్టర్ వెంకటరమణ, డబ్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ జోసఫ్, కర్నూలు, నంద్యాల ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 18 టీబీ యూనిట్లు మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, ల్యాబ్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.