న్యాయం కోసం డీఎంహెచ్‌వోకు వినతి
Published Tue, Nov 1 2016 11:38 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
శ్రీకాకుళం అర్బన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో గల గిరిజన ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న ఉద్యోగులకు బదిలీ అయినప్పటికీ ఐటీడీఏ పీవో అనాలోచిత నిర్ణయం కారణంగా బదిలీ కాకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ హంస(ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉంకిలి శ్రీనివాస్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు తక్షణమే బదిలీ చేయాలని కోరుతూ ఏపీ హంస ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సనపల తిరుపతిరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వివిధ కేటగిరిలకు చెందిన సుమారు 70మందికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబరు 272 ప్రకారం వారు కోరుకున్న చోటకు మైదాన ప్రాంతంలో బదిలీ అయినప్పటికీ ఐటీడీఏ పీవో వారికి రిలీవ్ చేయకపోవడం శోచనీయమన్నారు. బదిలీ అయిన వారికి తక్షణమే వారి వారి స్థానాలకు రిలీవ్ ఉత్తర్వులు ఇప్పించి న్యాయం చేయాలని ఆయన కోరారు. స్పందించిన డీఎంహెచ్‌వో డాక్టర్ సనపల తిరుపతిరావు మాట్లాడుతూ కలెక్టర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలసిన వారిలో డీఎంహెచ్‌వో ఏవో డాక్టర్ దవళ భాస్కరరావు, ఏపీ హంస జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొయ్యాన శ్రీనివాస్, బగాది వెంకటరమణ, కోశాధికారి బెండి జనార్ధనరావు, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.నవీన్‌కుమార్, సంఘ ప్రతినిధులు రామచంద్రరావు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
Advertisement
Advertisement