మొదటి డోస్‌ కోవిషీల్డ్‌..  రెండో డోస్‌ కోవాగ్జిన్‌ | Doctors Mistakenly Gives The Another Covid Vaccine In Nalgonda | Sakshi
Sakshi News home page

మొదటి డోస్‌ కోవిషీల్డ్‌..  రెండో డోస్‌ కోవాగ్జిన్‌

Published Mon, Apr 19 2021 3:11 AM | Last Updated on Mon, Apr 19 2021 8:56 AM

Doctors Mistakenly Gives The Another Covid Vaccine In Nalgonda - Sakshi

నల్లగొండ: కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడంలో వైద్యుల పొరపాటు ఒకరిని అస్వస్థతకు గురిచేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకా ఇస్తోంది. 45 సంవత్సరాలపైబడిన వారంతా తీసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ప్రజలు పెద్దఎత్తున వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. మొదటి డోస్‌ ఏ టీకా అయితే తీసుకుంటారో రెండో డోస్‌ కూడా అదే తీసుకోవాలి. కానీ వైద్యులు పొరపాటుగా  వ్యవహరించి మొదటి డోస్‌ కోవిషీల్డ్, రెండో డోస్‌ కోవాగ్జిన్‌ ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  

నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రైతు సంఘం నాయకుడు చిలుక విద్యాసాగర్‌రెడ్డి మార్చి 5న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కోవిషీల్డ్‌ టీకా తీçసుకున్నారు. తిరిగి రెండో డోస్‌ ఏప్రిల్‌ 17న అదే ఆస్పత్రిలో తీసుకున్నారు. అతనికి రెండోసారి కోవిషీల్డ్‌కు బదులుగా కోవాగ్జిన్‌ ఇచ్చారు. ఆ టీకా తీసుకున్నప్పటినుంచి అతనికి తల తిరగడం, నీరసంతో పడిపోవడం వంటి సమస్యలు వచ్చాయి. టీకా మార్పిడిపై కుటుంబ సభ్యులు ఫోన్‌లో వైద్యులను సంప్రదించగా, తమకు తెలియదని, డీఐఓ, డీఎంహెచ్‌ఓ, సూపరింటెండెంట్‌ను అడగాలని సమాధానం చెప్పారని బాధితుడు విద్యాసాగర్‌రెడ్డి ‘సాక్షి’తో వాపోయారు. ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది.  

వ్యాక్సిన్‌ సరిగ్గానే ఇచ్చారు: కొండల్‌రావు, డీఎంహెచ్‌ఓ  
విద్యాసాగర్‌రెడ్డికి రెండో డోస్‌కూడా కోవిషీల్డ్‌ వ్యాక్సినే ఇచ్చాం. కంప్యూటర్‌లో డేటా ఎంటర్‌ చేసే క్రమంలో పొరపాటు జరిగింది. మొదటి డోస్‌ ఏ వ్యాక్సిన్‌ తీసుకుంటారో దానికి సంబంధించి రెండో డోస్‌ తీసుకునే సందర్భంలో అతని పేరు ఫీడ్‌ చేయగానే ఏ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నది తెలుస్తుంది. వేరే వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఎంటర్‌ చేయడంలో తప్పిదం జరిగింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement