వెలుగు చూస్తున్న 'డీఎంహెచ్‌ఓ' ఆస్తులు
బ్యాంకు లాకర్లు, నివాసంలో మరింత బంగారం
–గాజువాక వద్ద స్థలం గుర్తింపు
–రికార్డులు కోర్టుకు సమర్పించిన సీఐయూ
–స్వరాజ్యలక్ష్మికి నోటీసు జారీ
సాక్షి, విశాఖపట్నం: తవ్వుతున్న కొద్దీ కర్నూలు డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో రెండు రోజులుగా ఆమె ఆస్తులపై కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ వింగ్(ఏసీబీ సీఐయూ) అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం విదితమే. గురువారం విశాఖలోని ఆమె నివాసంలో విచారణాధికారి, సీఐయూ డీఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు నేతృత్వంలో అధికార బృందం సోదాలు నిర్వహించింది. రూ.5.6 కోట్లు ఆస్తులు గుర్తించింది. శుక్రవారం కూడా సోదాలు కొనసాగాయి. స్వరాజ్యలక్ష్మికి చెందిన రెండు బ్యాంకు లాకర్లు తెరిచారు. ఒకదానిలో కేజీ, మరో దానిలో 1.6 కేజీల బంగారం బయటపడింది. నివాసంలో మరో పావుకిలో బంగారం దొరికింది. గాజువాకలో ఒక స్థలం కూడా ఉన్నట్లు రికార్డులను బట్టి తెలిసింది. అంతేకాకుండా నగరంలోని విజయ ఆస్పత్రిని రూ.4 కోట్లతో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇది ఆమె భర్త సూర్యనారాయణ నాయుడు పేరుమీద కొన్నారు. ఆస్పత్రి యజమాని సుదేందర్‌రెడ్డికి రూ.2కోట్లు అడ్వాన్స్ చెల్లించారు. మరో రూ.2కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఏసీబీ కంట్లో పడ్డారు. కుమారుడు శ్రీహర్ష చదువుకోసం కూడా రూ.కోట్లు ఖర్చు పెట్టారు. అమలాపురంలో అతను ఎంబీబీఎస్, విజయనగరంలో పీజీ చదివాడు. ఒక్క పీజీ సీటుకే రూ.2కోట్లు ఖర్చుపెట్టారు. శ్రీ హర్ష ఇటీవలే కేజీహెచ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా శిక్షణ పూర్తి చేసుకుని ఓ ఫార్మసీలో చేస్తున్నాడు. అతని తండ్రి సూర్యనారాయణ నాయుడు ప్రస్తుతం పంజాబ్‌లోని పటాన్‌కోటలో ప్రైవేటు వైద్యుడిగా ఉన్నారు.
నోటీసిచ్చాం:
డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి ఆస్తులకు సంబంధించిన రికార్డులను శుక్రవారం ఏసీబీ కోర్టుకు సమర్పించినట్లు సిఐయు డీఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు 'సాక్షి'కి వెల్లడించారు. మహిళ కనుక ఆమెను అరెస్ట్ చేయలేదని, కానీ నోటీసు జారీ చేశామని ఆయన తెలిపారు. అదే విధంగా వీరికి ఆస్పత్రి విక్రయించిన సురేందర్‌రెడ్డిని కూడా విచారించామని చెప్పారు.