నేడు పల్స్‌పోలియో
Published Sat, Apr 1 2017 9:50 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
ఏలూరు అర్బన్: పోలియోరహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కె. కోటేశ్వరి అన్నారు. శనివారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో అప్పుడే పుట్టిన çపసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించినా సరిహద్దు దేశాల్లో పోలియో వ్యాధి కేసులు న మోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా సంచార జాతులు, వలస కార్మికుల, ఇంటీరియర్ ప్రాంతాల చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు గాను ప్రత్యేక మొబైల్ టీములను ఏర్పాటు చేశామని అదే క్రమంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని రద్దీ కూడళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్యశాలలు, రైల్వే, ఆర్టీసీ బస్టాండ్‌ల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం, మంగళవారం రెండురోజుల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు అందని చిన్నారులను గుర్తించి అందిస్తారని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా అర్హులైన చిన్నారులను గుర్తించామని వారందరికీ అవసరమైన డోసులను సిద్ధం చేశామని తెలిపారు. ప్రజలు తమ చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ పి.ఉమాదేవి, డీఐఓ ఎం.మోహనకృష్ణ పాల్గొన్నారు.
Advertisement