విద్యార్థులతో ‘ఆరోగ్య అవగాహన సదస్సులు’
కర్నూలు(హాస్పిటల్): స్వాస్త్య విద్యావాహిణి పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విద్యార్థులతో ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ స్వాస్త్య విద్యావాహిణి పథకం కింద మెడికల్, డెంటల్, ఫార్మసి, ఆయుష్, నర్సింగ్, హోంసైన్స్ కళాశాలల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున ఈ కార్యక్రమానికి ఎంపిక చేశామన్నారు. ఆయా కళాశాలలకు 5 కి.మీ పరిధిలో చంద్రన్న సంచార వైద్యశాల వాహనం వెళ్లే గ్రామాలకు ఎంపిక చేసిన విద్యార్థులు ప్రతి నెలా ఒకరోజు వెళ్తారన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపైన వారు అవగాహన చేసుకుంటారని తెలిపారు. 14 వాహనాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పర్యవేక్షించి, ప్రతిరోజూ తమకు నివేదిక సమర్పిస్తారన్నారు.