నోట్లకట్టలు పొర్లాయి | Corruption in swarnamukhi canal works | Sakshi
Sakshi News home page

నోట్లకట్టలు పొర్లాయి

Published Fri, Jun 2 2017 8:37 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

నోట్లకట్టలు పొర్లాయి

నోట్లకట్టలు పొర్లాయి

► స్వర్ణముఖి, చల్లకాలువ పొర్లుకట్టల అభివృద్ధి పనుల్లో అవినీతి
► 2009లో తొలుత రూ.54 కోట్లతో అంచనాలు
► 19 శాతం లెస్‌తో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు
► అధిక మొత్తంతో అంచనాలు వేశారనే ఆరోపణలతో టెండర్లు రద్దు
► 2013లో రూ.45 కోట్ల అంచనాతో టెండర్లకు ఆహ్వానం
► రూ.40.30 కోట్లకు టెండర్లు ఖరారు
► 24 నెలల్లో పూర్తికావాల్సిన పనులు
► 90 శాతం కూడా పూర్తికాని వైనం


వాకాడు(గూడూరు) : వాకాడు, కోట మండలాల్లో జలయజ్ఞం పేరుతో జరుగుతున్న స్వర్ణముఖి, చల్లకాలువల పొర్లుకట్టల పటిష్టం పనుల్లో నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయి. ఇందులో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నిధులు బొక్కేశారు. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన జలయజ్ఞం పథకాన్ని ఆయన మరణానంతరం దోపీడీ పనులకు ఉపయోగించారనడానికి ఇదో ఉదాహరణ.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైపు నుంచి నాయుడుపేట, పెళ్లకూరు, కోట, వాకాడు మండలాల మీదుగా స్వర్ణముఖినది ప్రవహించి పామంజి, గోవిందుపల్లి మధ్యలో కలుస్తుంది. ఈ నదికి, ఉపనది అయిన చల్లకాలువకు వరదలు రావడం తక్కువే. తెలుగుగంగ నీరు విడుదల చేస్తేనే స్వర్ణముఖినదికి నీరు చేరుతుంది. దశాబ్దన్నర కాలంగా ఇవి నిండుగా ప్రవహించిన దాఖలాలు లేవు. పదేళ్లుగా వర్షాభావం ఉండటంతో వీటికి వరద ప్రమాదమేమీ లేదు. అయితే 2000–01లో భారీ వరదలు వచ్చినప్పుడు చల్లకాలవ, స్వర్ణముఖి నది వరద నీటితో పొంగి ప్రవహించాయి. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడితో 2009లో అధికారులు పొర్లుకట్టల అభివృద్ధికి భారీ నిధులతో అంచనాలు తయారుచేశారు. 16 కి. మీ చల్లకాలువ పొర్లు కట్టల అభివృద్ధికి ఇరువైపులా రూ.54 కోట్లతో అంచనాలు తయారు చేశారు.

దీనికి సంబంధించి కోట మండలం గూడలి నుంచి గోవిందుపల్లిపాళెం వరకు ఎడమ వైపు పొర్లు కట్టలకు రూ.28 కోట్లు, కుడివైపు పొర్లుకట్టలకు రూ.26 కోట్లు అంచనాలు నిర్ణయించి నిధులు మంజూరు చేశారు. ఇరిగేషన్‌ అధికారులు టెండర్లు పిలవగా నెల్లూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ 19 శాతం లెస్‌తో పనులను దక్కించుకున్నారు. పనులు ప్రారంభానికి ముందే అంచనాల్లో అక్రమాలు జరిగాయని, ఇంజినీర్లు ఇష్టారాజ్యంగా అంచనాల వ్యయం అధికంగా వేసినట్లు ఫిర్యాదులు రావడంతో అప్పట్లో పనులు నిలిపివేశారు. ఐతే నీటి పారుదల శాఖ అధికారులు తిరిగి అంచనాలు సవరించి రూ.54 కోట్లకు బదులుగా రూ.9 కోట్లు వ్యయం తగ్గించి రూ.45 కోట్లకు ఖరారు చేశా రు. దీనికి సంబంధించి 2013లో టెండర్లు పిలిచి మళ్ళీ పాత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించారు. కానీ సదరు కాంట్రాక్టరు టెండర్‌లో లెస్‌ వేసిన కారణంగా రూ.40.30 కోట్లకు పొర్టుకట్టల పనులు దక్కించుకున్నారు. ఈ పనులు 24 నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు 90 శాతం పనులు మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయి పనులు నిర్వహించినట్లు అధికారులు గొప్పలు చెప్పుకోవడం గమనార్హం. కానీ పొర్లుకట్టల పనులు పూర్తికాక ముందే ఎక్కడ మట్టి అక్కడే జారిపోతోంది. కొన్ని చోట్ల పొర్లు కట్టలకు సైడు ఎర్త్‌ అంటే అక్కడ మట్టి అక్కడే తీసి వేసి పనులు నాసిరకంగా చేపట్టారు. అంతే కాకుండా కాంట్రాక్టర్‌కు భారీగా లబ్ధి చేకూర్చేం దుకు పొర్లు కట్టలకు దాదాపు మీటరు ఎత్తు తగ్గించినట్టు తెలిసింది. దీంతో సంబంధిత కాం ట్రాక్టర్‌కు కోట్ల రూపాయల ఆదాయం లభించిన ట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం పొర్లుకట్ట ఎత్తు 5.50 మీటర్లు ఉండాలి. కింది భాగం 22 మీటర్లుండాలి. కానీ ప్రస్తుతం ఎత్తు 4.5 మీటర్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్‌ ‘లెస్‌’ ను కారణంగా చూపి అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. ఒక మీటరు ఎత్తు తగ్గడం వలన నిర్మాణ వ్యయం బాగా తగ్గే అవకాశం ఉంది. ఐతే గతంలో ఒక ఎఈ ఆధ్వర్యంలో పొర్లుకట్టల అంచనాలు తారుమారు చేసినట్లు తెలిసింది.

పొర్లుకట్టల పనుల్లోనూ భారీగా అవినీతి
అదేవిధంగా స్వర్ణముఖి పొర్లుకట్టల పనుల్లోనూ భారీగా అవినీతి అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పొర్లుకట్టల పనులకు కూడా సమీపంలోని మట్టినే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే చేపట్టిన పొర్లు కట్టల మట్టి జారిపోయింది. పలు చోట్ల గండ్లు పడినట్లుగా కనబడుతున్నాయి. వాస్తవంగా పొర్లుకట్టల పటిష్టం పనుల్లో ప్రతి అరమీటరుకు 20 టన్నులు గల రోడ్‌ రోలర్‌తో రోలింగ్‌ చేసి పటిష్టం చేయాల్సి ఉంది. కాని పొర్లుకట్టల పనుల్లో ఒకేసారి రోలింగ్‌ చేపట్టినట్లు తెలిసింది. చల్లకాలువ, స్వర్ణముఖి పొర్లుకట్టల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. పొర్లుకట్టల పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయని, పనుల్లో జరుగుతున్న అవినీతిపై ప్రజాప్రతినిధులు గళమెత్తడంతో ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు కోట జలవనరుల శాఖ ఏఈని బదిలీ చేశారు. అయితే మొత్తం పనుల తీరును సమీక్షించి ప్రజాధనాన్ని సద్వినియోగమయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement