పోలీసుల.. చేతివాటం! | Nalgonda Police Corruption in Alcohol Sales in Block Case | Sakshi
Sakshi News home page

పోలీసుల.. చేతివాటం!

Published Tue, May 12 2020 12:49 PM | Last Updated on Tue, May 12 2020 12:49 PM

Nalgonda Police Corruption in Alcohol Sales in Block Case - Sakshi

ప్రస్తుతం మద్యం తరలింపు కేసులో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్న కారు, రెండు బైకులు ఇవే..

లాక్‌డౌన్‌ ఎందరినో ఇబ్బంది పెడుతూ.. మరెందరికో ఉపాధి లేకుండా చేసింది. ఇతర శాఖల సిబ్బందితోపాటు పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా రోడ్లపైనే రేయింబవళ్లు డ్యూటీలు చేసి శభాష్‌ అనిపించుకుంది. కానీ, కొందరు పోలీసులు మాత్రం సొమ్ము చేసుకోవడంలో బిజీగా గడిపారు. లాక్‌డౌన్‌ సమయంలో జిల్లావ్యాప్తంగా మద్యం షాపులు మూసివేశారు. దీంతో తెరవెనుక దందాకు తెరలేసింది. ఇలా.. మద్యం అక్రమ వ్యాపారమే కొందరు పోలీస్‌ అధికారుల జేబుల నింపింది. తిమ్మిని బమ్మిని చేసేలా.. కేసులను తారుమారు చేసి నిందితులకు సహకరించేలా చేసింది..!

సాక్షిప్రతినిధి, నల్లగొండ : లక్షల రూపాయలు పోసి తెచ్చుకున్న పోస్టింగ్‌.. పెట్టిన ఖర్చులను రాబట్టుకునేందుకు చట్టానికి తూట్లు పొడిచేలా కొందరు పోలీస్‌ అధికారులను ప్రేరేపిస్తోంది. ఫలితంగా కేసులు తారుమారు అవుతున్నాయి. సదరు అధికారుల జేబులు నిండుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో పోలీస్‌ అధికారుల పోస్టింగులకు ధరలు నిర్ణయించారు. సీఐ పోస్టింగ్‌ కావాలంటే రూ.5లక్షలు, ఎస్సై పోస్టింగ్‌కు అయితే రూ.3లక్షల రేటు పలుకుతోంది. ఉన్నతాధికారులు ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఒకటీ రెండు చోట్ల మినహాయిస్తే.. మిగిలినవన్నీ పొలిటికల్‌ పోస్టింగులే అని సమాచారం. దీని ప్రభావం సవ్యంగా సాగాల్సిన ‘పోలీసింగ్‌’పై పడుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలాచోట్ల ‘బ్యాక్‌ డోర్‌ బిజినెస్‌’ జరిగింది. అటు ఎక్సైజ్, ఇటు పోలీసులు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగా ఎవరి స్థాయిలో వారికి మామూళ్లు ముట్టాయన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇదో రకం దందా కాగా, మరికొన్ని చోట్ల ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి మద్యం అక్రమంగా తరలించి వ్యాపారం చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల పోలీసులకు దొరికిపోయిన వారూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో పోలీసులు స్వయంగా దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం కూడా చేసుకున్నారు. వీటన్నింటికి భిన్నంగా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకున్న మద్యం అక్రమ తరలింపు వ్యవహారం చర్చనీయాంశమైంది.

ఇదీ... సంఘటన !
గత నెల 28వ తేదీన హాలియా పోలీస్‌ స్టేషన్‌లో మద్యం అక్రమ వ్యాపారానికి సంబంధించి కేసు (ఎఫ్‌ఐఆర్‌ నం:95/2020) నమోదు అయ్యింది. హాలియా పట్టణానికి చెందిన ఏసురాజు, మార్క్, చందు, వేణు, కోటేశ్, కనగల్‌ మండలానికి చెందిన కిరణ్‌కుమార్, నవీన్‌కుమార్‌ అనే ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదైంది. వీరు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను  స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను స్థానిక పోలీసులు అధికారికంగానే ప్రకటించారు. ఎంత మద్యం స్వాధీనం చేసుకున్నారో వివరాలు కూడా వెల్లడించారు. ఆఫీసర్స్‌ చాయిస్‌ క్వార్టర్‌ బాటిళ్లు – 65, ఐబీ క్వార్టర్‌ బాటిళ్లు–25, మెక్‌డోవెల్‌ 90ఎంఎల్‌ బాటిళ్లు – 50, కెఎఫ్‌ బీర్లు–24 బాటిళ్లతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు, స్పష్టంగానే వివరాలు ప్రకటించారు.

ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం
అక్రమ మద్యం కేసు వ్యవçహారంలో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించిన వారిలో హాలియా పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులతోపాటు కనగల్‌ మండలానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్రమంగా మద్యం కారులో తరలిస్తుండగా పట్టుకున్నాం. వీరందరిని విచారించగా అందులో ఓ వ్యక్తి విద్యార్థిగా ఉన్నందున వార్నింగ్‌ ఇచ్చి వదిలి వేశాం. కేసు దర్యాప్తు  కొనసాగుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో తేలాల్సి ఉంది.– శివకుమార్, ఎస్‌ఐ, హాలియా

ఏం జరిగింది..?
ఈ కేసులో పోలీసుల స్వాధీనమైన రెండు వాహనాల్లో ఒకటి ఇంకా రిజిస్టర్‌ కానీ కొత్త కారు. అందులో రూ.8.25ల నగదు ఉన్నట్లు తెలియడంతో ఓ ఐడి పార్టీ కానిస్టేబుల్, కనగల్‌ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి మధ్యవర్తిగా బేరసారాలు నడిచాయని విశ్వసనీయ సమాచారం. ఈ నగదును రిలీజ్‌ చేయడం, కారును వదిలేయడం, కేసులో ఒక వ్యక్తి పేరును పక్కన పెట్టేందుకు డీల్‌ కుదిరినట్లు సమాచారం. ఇందులో ముందుగా రూ.50వేలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఇక, ఈ కేసును తారుమారు చేసేందుకు కూడా కనీసం రూ.1.50లక్షలు మరో అధికారికి ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో బయట పడి రచ్చ జరగడంతో సదరు అధికారి రూ.50వేలు ఓ ప్రజాప్రతినిధి సంబంధీకుల చేతిలో పెట్టి పాప పరిహారం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనగల్‌ ప్రాంతం నుంచి హాలియాకు మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు మొదట ప్రకటించిన వివరాలకు, రెండు మూడు రోజుల తర్వాత  ఇచ్చిన వివరణకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఇప్పుడు ఒక కారు, రెండు బైక్‌లను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. మరో వైపు తొలుత కేసు నమోదైన వారిలో ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి చెందిన కొత్త కారును తప్పించిన విషయాన్ని దాటవేస్తున్నారు. మొత్తంగా ఈ చిన్న కేసులోనే రూ.2లక్షల దాకా చేతులు మారినట్లు చెబుతున్నారు. ఇందులో నుంచి రూ.50వేలు ఓ ప్రజాప్రతినిధికి చేరడం విచిత్రమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement