కాసులిస్తేనే.. కనులారా దర్శనం
కాసులిస్తేనే.. కనులారా దర్శనం
Published Sat, Oct 22 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
- ఇదేమి గోవిందా
- అహోబిల ఆలయ సిబ్బంది ఇష్టారాజ్యం
- గాడితప్పిన పాలన
-భక్తులకు తప్పని తిప్పలు
ఆళ్లగడ్డ: పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో కొంత మంది ఆలయ సిబ్బంది, అర్చకుల తీరుతో భక్తులు మనోవేదనకు గురవుతున్నారు. కాసులిస్తేనే కనులారా దర్శనం కల్పిస్తుండడం విమర్శలు తావిస్తోంది. అహోబిల క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రకృతి అందాల మధ్య నవనారసింహుల ఆలయాలు ఇక్కడ వెలిశాయి.. ఉగ్రరూపం నుంచి శాంతి స్వరూపునిగా మారిన శ్రీలక్ష్మినృసింహస్వామిని దర్శించుకోవడం వల్ల జీవితంలో ప్రశాంతత, సుఖశాంతులు, ఆరోగ్యం, ధనప్రాప్తి కులుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశీ భక్తులు సైతం పదుల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంలో కొందరు అధికారులు, సిబ్బంది, అర్చకుల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
అహోబిల క్షేత్రం పరిధిలోని నవనారసింహ స్వాములను దర్శించుకునేందుకు త్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ సంఖ్య శని, ఆదివారాలతో పర్వదినాల్లో రెట్టింపు ఉంటుంది.ఎగువ, దిగువ అహోబిలాల్లో శ్రీ జ్వాలనరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని అనంతరం నల్లమలలో వెలసిన నవనారసింహ క్షేత్రాలను దర్శించుకునేందుకు కాలినడకన వెళుతుంటారు. ఎంతో ఆశతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడి పనిచేసే సిబ్బందికి, అర్చకులకు కాసులిస్తేతపప్ప కనులారా స్వామివార్ల దర్శన భాగ్యం కలగడం లేదు. గుడిలోకి వెళ్లిన భక్తుల నుంచి అర్చకులు, సిబ్బంది రూ. 100 నుంచి రూ 10,000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి ఆలయానికి వచ్చే భక్తులకు జాతకం పేరుతో భయం కల్పించి.. నివారణకు ఏవో మంత్రాలు చదువుతూ అధిక మొత్తంలో బహిరంగంగా నగదు తీసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. అంతే కాదు దండులు వేస్తు, వేయిస్తూ.. దారాలు కడుతు, జేబులకు చిల్లులు పెడుతున్నారు.
ఫిర్యాదులు అధికం..
నవ నరసింహ స్వామి దేవాలయాల్లో కొందరు సిబ్బంది, అర్చకులు తమ ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నారు. అడిగినంత సొమ్ములిస్తేనే ఆలయంలోపలికి వదులుతున్నారంటూ భక్తులు అహోబిల అధికారులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. దీంతో కొన్ని సార్లు భక్తుల ఎదుటే సిబ్బందిని అధికారులు మందలించారు కూడా. ఇలాంటి సిబ్బందిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప భక్తులకు స్వామివార్ల దర్శన భాగ్యం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్పందించని అధికారులు..
నెల రోజుల క్రితం దిగువ అహోబిలంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అర్చన చేయించుకునేందుకు టిక్కెట్ తీసుకుని వెళ్లారు. అక్కడ అర్చకుడు సెల్‌తో ఆడుకుంటూ భక్తులను పట్టించుకోలేదు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపొమ్మని అర్చకుడు దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయం ఆలయ అధికారికి పిర్యాదు చేశారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
దర్శన టిక్కెట్ల రీసైక్లింగ్
దిగువ అహోబిలంలో శీఘ్ర దర్శనం కోసం రూ. 50 రూపాయలు, అర్చనకు రూ. 50 ప్రకారం టిక్కెట్లు ఇస్తున్నారు. అయితే ఒకసారి తీసుకెళ్లిన టిక్కెట్‌ను చించకుండా మళ్లీ సిబ్బంది ద్వారా బుకింగ్‌లోకి పంపించి రీ సైక్లింగ్ చేస్తున్నారన్న విషయం ఇక్కడ బహిరంగ రహస్యమే. అంతేకాకుండా.. హుండీ మూతికి లోపలి భాగంలో అడ్డంగా ఓ వస్త్రం ఉంచి భక్తులు వేసిన సొమ్ములు పూర్తిగా లోపలపడకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అహోబిలంలో ఓ అధికారి అడుగలకు మడుగులొత్తుతే చాలు.. పనిచేయక పోయినా జీతం వస్తుందనే విమర్శలు ఉన్నాయి. దేవస్థాన పరిధిలోని ఆలయాల్లో వివిధ రకాల విధులు నిర్వహించేందుకు 90 మంది సిబ్బంది ఉన్నారు. భద్రతా ఏర్పాట్లు చూసుకునేందుకు మరో 10 మంది హోంగార్డులను నియమించుకున్నారు. హోంగార్డులు కేవలం అధికారికి, కార్యాలయానికి మాత్రమే కాపలాగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తప్పు చేసే సిబ్బందిపై చర్యలు: వాణి, అహోబిల ఆలయ ఈవో
దర్శనానికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బ్బంది తప్పు చేసినట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటాం.
Advertisement
Advertisement