మామూళ్ల మత్తు | curreption kick | Sakshi
Sakshi News home page

మామూళ్ల మత్తు

Published Fri, Jan 27 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

మామూళ్ల మత్తు

మామూళ్ల మత్తు

ఈ షాపులు మూయరే...!
- రాత్రి 10 గంటలు దాటినా నడుస్తున్న వైన్‌షాపులు
- కన్నెత్తి చూడని ఎక్సైజ్‌ సిబ్బంది
- ఆదాయం పెంచాలని ప్రభుత్వం నుంచీ ఒత్తిళ్లు
- జిల్లాలో అమలుకు నోచుకోని నిబంధనలు
- దాడులు వద్దని పై నుంచే ఆదేశాలు?
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: 
ఇది కర్నూలు నగరంలోని ఓ వైన్‌ షాపు. రాత్రి పది గంటల పది నిమిషాలు అయినప్పటికీ ఇది మూతపడలేదు. యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. ఇది రోజు వారీగా జరిగే తంతే. అయినప్పటికీ ఎక్పైజ్‌ అధికారులు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల పరిస్థితీ ఇంతే.
 
వాస్తవానికి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచుకోవాలి. ఇదీ వైన్‌షాపులను మంజూరు చేసిన సమయంలో ఎక్సైజ్‌ అధికారులు విధించిన నిబంధన. అయితే, జిల్లాలో ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎక్సైజ్‌ అధికారులు మాత్రం అటువైపు కనీసం కన్నెత్తి చూడరు. నెలవారీగా మామూళ్లు అందుతుండటమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాగైనా ఆదాయం పెంచాల్సిందేనంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లు కూడా అధికారులు పట్టించుకోక పోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
నెలనెలా ఇస్తున్నాం.. పట్టించుకోవద్దు
ఎక్సైజ్‌ అధికారులకు కనీసం ఏ మాత్రం బెదరకుండా మద్యం దుకాణాల యాజమాన్యాలు బరితెగించడానికి ప్రధాన కారణం నెలవారీ మాముళ్లే. ప్రతి షాపు నుంచి ఎక్సైజ్‌ సిబ్బందికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ అందుతోంది. గరిష్ట చిల్లర ధర(ఎంఆర్‌పీ) కంటే అధిక ధరకు విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఎప్పుడు వ్యాపారం చేసుకున్నా పట్టించుకోకుండా ఉండేందుకే ఈ మాముళ్లు ఇస్తున్నామని మద్యం సిండికేట్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నందున తామేమి చేసినా పట్టించుకోవద్దని ఎక్సైజ్‌ సిబ్బందిని కోరుతున్నాయి. అంతేకాకుండా మద్యం దుకాణం ముందే మందు బాటిల్‌ తాగేసినా కూడా ఎక్సైజ్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎలాంటి పర్మిట్‌ రూం అనుమతి లేకపోయినప్పటికీ కిమ్మనకుండా ఉంటున్నారు.
 
తెగిస్తున్న బెల్టు...!
జిల్లావ్యాప్తంగా బెల్టు షాపుల జోరు రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్కో గ్రామంలో ఏకంగా 10 నుంచి 15 వరకూ బెల్టు దుకాణాలు నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ఎక్కడా ఎక్సైజ్‌ సిబ్బంది దాడులు చేయడం లేదు. ఎక్కడ కూడా బెల్టు దుకాణాన్ని గుర్తించిన సంఘటనలూ లేవు. బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నందుకు కూడా ఎక్సైజ్‌ సిబ్బందికి మామూళ్లు ఇస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
 
అంతేకాకుండా ఆదాయం పెంచాలంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కూడా యథేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు ఎక్సైజ్‌ సిబ్బంది అవకాశం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా నోట్ల రద్దు నేపథ్యంలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ ఆదాయంపై మాత్రం పెద్దగా ప్రభావం పడలేదు. దీంతో ఎలాగైనా ఎక్సైజ్‌ ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా ఎక్కడా దాడులు జరపకుండా పై నుంచే  ఆదేశాలు ఉన్నాయని కూడా ఎక్సైజ్‌ సిబ్బందే పేర్కొంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement