కొందరికే పునరావాసం | No alternative jobs for gutumba manufacturers | Sakshi
Sakshi News home page

కొందరికే పునరావాసం

Published Sat, Jan 27 2018 3:09 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

No alternative jobs for gutumba manufacturers - Sakshi

కేసు ఎతైయ్యాలని కోరుతున్న విమలాబాయి

ఉట్నూర్‌(ఖానాపూర్‌): గుడుంబా పునరావాస పథకం ప్రహసనంగా మారింది. ఆర్భాటంగా గుడుంబా తయారీదారులను ఎంపిక చేసిన అధికార యంత్రాంగం పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా వందలాది మంది తయారీదారుల్లో జిల్లావ్యాప్తంగా కేవలం పది మందికి స్వయం ఉపాధి కల్పించారు. గుడుంబా విక్రయాలు అరికట్టి.. స్వయం ఉపాధి కల్పించడం ద్వారా తయారీదారులు, విక్రేతల ఆర్థికాభివద్ధికి బాటలు వేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ద్వారా ఉట్నూర్‌ ఎక్సైజ్‌ కార్యాలయం పరిధిలో ముగ్గురికే భరోసా లభించింది. ఎక్సైజ్‌ అధికారులు 215 మంది గుడుంబా విక్రయదారుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 115 మంది జాబితా కార్యాలయానికి చేరింది. చివరికి 30 మందితో కూడిన జాబితా రాగా.. మొదటి విడతలో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. కానీ ఇప్పటివరకు ముగ్గురికి మాత్రమే ఉపాధికి రుణాలు అందజేశారు.

మిగతా వారికి ఇప్పటికీ రుణాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉట్నూర్‌ ఎక్సైజ్‌ కార్యాలయం పరిధిలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాలు ఉన్నాయి. ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు కావడంతో ఈ ప్రాంతాల్లో నివసించే వారి ఆర్థిక స్థితిగతులు అంతంతగా ఉన్నాయి. దీంతో చాలామంది గుడుంబా తయారీ జీవనోపాధిగా ఎంచుకున్నారు. గుడుంబా తాగిన కొందరు ప్రాణాలు కోల్పోవడం, వారి కుటుంబాలు వీధిన పడడంతో గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా గుడుంబా విక్రయాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఎంపిక చేసిన వారికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి స్వయం ఉపాధి కల్పించింది. తమకూ రుణాలు మంజూరు చేయాలని మిగతా వారు కోరుతున్నారు. మరోవైపు గతంలో ఉన్న కేసుల కారణంగా తయారీ, విక్రేతలు ఇబ్బందులు పడుతున్నారు. 

పునరావాసం ఇలా..
ఆదిలాబాద్‌: గుడుంబా తయారీని కుటీర పరిశ్రమగా చేసుకుని జీవనం సాగించిన కొందరు ఇప్పుడు ఆ దందా నుంచి బయటపడ్డారు. గుడుంబా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న గుడుంబా పునరావాస పథకంతో స్వయం ఉపాధి పొందుతున్నారు.   గుడుంబా తయారీని నమ్ముకుని బతుకుబండిని నడిపిస్తున్న నిరుపేద కుటుంబాలు, విక్రయిస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడుంబా పునరావాస పథకాన్ని తీసుకొచ్చింది. గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపా«ధి అవకాశాలు కల్పించింది. కేసులు, బైండోవర్‌ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో దాడులు నిర్వహించడంతో చాలావరకు గుడుంబా తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 

జిల్లాలో గతంలో పరిస్థితి..
ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లు ఉన్నాయి. 2016లో ఉమ్మడి జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాల విభజన తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలో గుడుంబా చాలామట్టుకు తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మారుమూల గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా, సారా విక్రయాలు జరుగుతుండేవి. మంచిర్యాల, లక్సెట్టిపేట, నిర్మల్, బెల్లంపల్లి ప్రాంతాల్లో గుడుంబా పెద్ద ఎత్తున తయారు చేసేవారు. ఈ ప్రాంతాల్లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించినప్పుడల్లా ఎంతో మందిపై కేసులు నమోదయ్యేవి. అయినప్పటికీ గుడుంబా తయారీ కుటుంబాలకు ప్రధాన ఆధారం కావడంతో విక్రయిస్తూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం గుడుంబా పునరావాస పథకం కింద ఆర్థిక సాయం అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. 

లబ్ధిదారులకు రూ.2 లక్షలు..
జిల్లాలో నాటుసారా, గుడుంబా అమ్మకాలే జీవనాధారంగా గుడుంబా తయారీ కుటుంబాలు ఉన్నాయి. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. గుడుంబా తయారీ మానేసి జనజీవన స్రవంతిలో కలిసిన ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. 2015 జనవరి నుంచి 2016 సెప్టెంబర్‌ వరకు గుడుంబా విక్రయిస్తూ బైండోవర్‌ అయిన ప్రతి ఒక్కరూ ఈ స్కీంకు అర్హులుగా నిర్ణయించారు. జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు అర్హులైన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఈ జాబితాలో 10 మందిని ఎంపిక చేసిన ప్రభుత్వం పథకం కింద ఆర్థిక సాయం అందజేసింది. ఆర్థిక సాయం పొందిన వారిలో కిరాణ షాపు, ఆటో, ఇతర చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు.

కేసు ఎత్తేస్తే బాగుంటది
భర్త ఉన్నప్పుడు గుడుంబా అమ్మేవాడు. ఆయన పోయాక ఉపాధి కోసం నేను కొన్ని రోజులు అమ్మిన. ఆబ్కారీ పోలీసులు కేసులు పెట్టారు. తర్వాత దొరికిన కూలీ చేసుకుని బతికిన. ప్రభుత్వం నాకు రూ.2 లక్షలు లోను మంజూరు చేసింది. ఆటో కొనుక్కొని కిరాయికి ఇస్తున్న. రోజుకు రూ.200 కిరాయి వస్తుంది. సర్కారు సహాయంతోనే రోజు గడుస్తోంది. ఇంత చేసిండ్రు కేసు కూడా ఎత్తేస్తే బాగుంటది. పేషీలకు తిరిగి తిరిగి పరేషాన్‌ అవుతుంది. 
– జాదవ్‌ విమలాబాయి,  గుడిహత్నూర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement