కె.రాజ్యలక్ష్మి, డీపీఈవో, ఆదిలాబాద్
సాక్షి, ఆదిలాబాద్: ఎక్సైజ్ శాఖ బాగోతం వీధికెక్కింది. ఆదిలాబాద్‌లో డీపీఈవో కె.రాజ్యలక్ష్మి విధుల్లో వేధిస్తున్నారని సోమవారం ఆదిలాబాద్ కార్యాలయం మినిస్టీరియల్ ఉద్యోగులు టీఎన్‌జీవో నేతలతో కలిసి డిప్యూటీ కమిషనర్ రమేశ్‌రాజుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆదిలాబాద్ డీపీఈవో కార్యాలయ సిబ్బంది సామూహికంగా సెలవు పెట్టి విధులకు దూరంగా ఉంటున్నారు. ఈ సంఘటన తర్వాత డీపీఈవోకు మద్దతుగా కొన్ని కుల సంఘాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యాలయంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న శ్రీధర్, సంజీవ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతుండగా, చర్యలు తీసుకోవడంతో అధికారిణిపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొనడం సంచలనం కలిగించింది. తాజాగా వివాదం మరింత ముదిరింది.
నాలుగు జిల్లాలకు పాకిన వైనం..
సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీఈవో) కార్యాలయ మినిస్టీరియల్ ఉద్యోగులు సామూహికంగా సెలవు పెట్టి విధులకు దూరంగా ఉన్నారు. బుధవారం నుంచి ఆదిలాబాద్ సిబ్బందికి తోడుగా నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాల డీపీఈవో మినిస్టీరియల్ సిబ్బంది కూడా సామూహికంగా సెలవు పెట్టి విధులకు దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా పంచాయితీ అక్కడికి చేరింది.
సిబ్బంది ఆరోపణలు..
కొత్త ఎక్సైజ్ పాలసీ నోటిఫికేషన్ విడుదలకు ఒక్కరోజు ముందు సెప్టెంబర్ 12న ఆదిలాబాద్ డీపీఈవోగా బాధ్యతలు స్వీకరించిన కె.రాజ్యలక్ష్మితో ఆ శాఖ సిబ్బందికి నెలరోజులు కాకముందే పొసగకపోవడంపై చర్చ సాగుతోంది. వచ్చి రాగానే ప్రధానంగా కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కమిషనర్ ఆదేశాల ప్రకారం దరఖాస్తులు స్వీకరించే కౌంటర్ల దగ్గర సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశాలు ఉండగా, కార్యాలయంలోని ప్రతీ గదిలో అందరు కనిపించేలా వాటిని అమర్చారని ఆరోపిస్తున్నారు. ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసి మాట్లాడినా చాంబర్‌కు పిలిపించి బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. లైసెన్సుల కోసం ఎవరు వచ్చి తమను కలిసినా తనకు తెలుపకుండా ఎవరూ రావద్దని, సిబ్బంది బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఒక నిమిషం కంటే ఎక్కువగా మాట్లాడవద్దని అంటున్నారని చెబుతున్నారు. లేనిపక్షంలో సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొంటున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ నేపథ్యంలో మద్యం, కల్లు వ్యాపారుల నుంచి భారీగా మామూళ్లు అందే పరిస్థితుల్లో ఇటు సిబ్బంది, అధికారుల మధ్య వివాదాలు మొదలయ్యాయన్న చర్చ కూడా సాగుతోంది. అయితే అధికారిణిపై చర్యలు తీసుకునేంత వరకు తాము విధుల్లో చేరేది లేదని మినిస్టీరియల్ స్టాఫ్ పేర్కొంటున్నారు. మంత్రి జోగు రామన్న దృష్టికి విషయాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
టైట్ షెడ్యూల్ కారణంగా..
నేను జిల్లాకు వచ్చి నెల కూడా కాలేదు. గత నెల 13న కొత్త ఎక్సైజ్ పాలసీ విడుదలైంది. వైన్స్ దుకాణాల లైసెన్స్, బార్ల రెన్యువల్, కొత్త కల్లు పాలసీ అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్ని పనిచేయాలని ఆదేశించడాన్ని తప్పుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు ఏ సెక్షన్లు ఎవరు చూస్తున్నారో కూడా నాకు తెలియదు. సీసీ కెమెరాలు కావాలని పెట్టించింది కాదు.. కమిషనర్ ఆదేశాల మేరకే ఏర్పాటు చేశాం. వారి అక్రమాలకు అడ్డు పడుతున్నందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. విధులకు సామూహిక సెలవు పెడుతున్నట్లు కనీసం సమాచారం ఇవ్వలేదు. డిప్యూటీ కమిషనర్‌కు దృష్టికి కూడా తీసుకెళ్లకుండా టీఎన్‌జీవో నేతల దగ్గరికి వెళ్లడం సబబు కాదు. – కె.రాజ్యలక్ష్మి, డీపీఈవో, ఆదిలాబాద్
సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారు
ఎంతో మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్ల కింద ఇదివరకు పనిచేశాం. ఇప్పటికీ ఎవరితో వివాదం ఎదురుకాలేదు. కార్యాలయంలో సీసీ కెమెరాలు పెట్టడమే కాకుండా ప్రతీ చిన్న విషయానికి వేధించడం పరిపాటిగా మారింది. ఏ చిన్న తప్పు దొరికినా సస్పెండ్ చేస్తానని బెదిరించేలా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో సామూహిక సెలవులు కొనసాగుతాయి. – శ్రీధర్, ఎక్సైజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment