సాక్షి, ఆదిలాబాద్ : ఒక్కొక్క మద్యం దుకాణం కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు.. షాపు మాత్రం దక్కేది ఒక్కరికే. లక్కీడ్రాలో ఎవరికి మద్యం షాపు దక్కుతుందో నేడు తేలిపోనుంది. బుధవారంతో కొత్త మద్యం పాలసీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా, శుక్రవారం ఈ టెండర్లకు సంబంధించి లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్స్‌లో ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
కలెక్టర్ సమక్షంలో..
కలెక్టర్ దివ్యదేవరాజన్ సమక్షంలో ఈ లక్కీడ్రా ప్రక్రియ చేపట్టనున్నారు. డీపీఈఓ రవీందర్‌రాజు, సీఐలు, ఎస్సైలు, ఎక్సైజ్ సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. జిల్లాలో 31 మద్యం దుకాణాల కోసం 528 దరఖాస్తులు వచ్చాయి. సంఖ్య నంబర్ పరంగా మొదటి షాపు నుంచి చివరి షాపు వరకు ఈ లక్కీడ్రా కొనసాగుతుంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖాధికారులు జనార్ధన్ రెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాట్లు చేశారు.
దరఖాస్తుదారు తప్పనిసరి..
ఈ టెండర్లలో దరఖాస్తుదారు తప్పనిసరి పాల్గొనాలి. లేనిపక్షంలో అతని దరఖాస్తును డిస్‌క్వాలిఫై చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రూ.5లక్షల ఫెనా ల్టీ విధించనున్నట్లు పేర్కొంటున్నారు. తద్వారా లక్కీడ్రా సమయంలో దరఖాస్తుదారు లేనిపక్షంలో అతని పేరును తొలగిస్తారు. ఇదిలా ఉంటే లక్కీడ్రాలో షాపు దక్కిన వ్యక్తి వార్షిక అద్దె పరంగా రెండు సంవత్సరాలది కలిపి 8 విడతల్లో చెల్లించాల్సి ఉండగా, మొదటి విడత 1/8వ వంతు అప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ఇదే ప్రాంగణంలో బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేశారు. లక్కీడ్రా రోజే 31 దుకాణా లకు సంబంధించి రెండేళ్ల లైసెన్స్ ఫీజులో 1/8వ వంతు శుక్రవారమే వసూలు కానుంది.
ఆదాయం భళా..
జిల్లాలో దరఖాస్తు ఫీజు ద్వారా రూ.10.56 కోట్ల ఆదాయం రాగా, రెండేళ్ల లైసెన్స్ ఫీజు ద్వారా 31 షాపులకు మొత్తంగా 8 విడతల్లో కలిపి రూ.35.30 కోట్ల రాబడి రానుంది. 2017–19 పాలసీలో దరఖాస్తుల ద్వారా రూ.5.59 కోట్లు, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.26.60 కోట్లు రాబడి సమకూరింది. తాజా పాలసీలో దరఖాస్తు ఫీజు ఆదాయం రెట్టింపు కాగా, లైసెన్స్ ఫీజు రాబడి రూ.8.70 కోట్లు అదనంగా సమకూరుతుంది. ఈ విధంగా ఈ కొత్త పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం బాగా నే వచ్చింది. మొత్తం మీద 2019–21 మద్యం పాలసీలో బోణి అదిరింది. ఇదిలా ఉంటే గత రెండేళ్లలో లిక్కర్ అమ్మకాల ద్వారా ఎస్సైజ్ ఆదాయాన్ని పరిశీలిస్తే.. 2017–18 సంవత్సరంలో రూ.226.26 కోట్లు, 2018–19లో రూ.241.32 కోట్లు సమకూరింది.
Comments
Please login to add a commentAdd a comment