అవస్థల హాస్టల్
ఇరుకు గదులే శరణ్యం
104మంది బాలికలకు ఐదే బాత్‌రూమ్‌లు
పట్టించుకోని బీసీ సంక్షేమ శాఖ
ఎంవీపీ కాలనీ: బీసీ బాలికల వసతిగృహాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మొత్తం 104 మంది విద్యార్థినులకు ఐదే బాత్‌రూంలున్నాయి. వీరందరి వసతికి ఐదు గదులే ఉన్నాయి. నెలకు రూ.17 వేలు అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వం చదరపు అడుగుకు కేవలం రూ.7 మాత్రమే కేటాయించడంతో అద్దె భవనాలు దొరకని దుస్థితి నెలకొంది. ఈ వసతిగృహంలో వందమందికిగాను 104 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరు నగరంలోని ఏఎస్‌రాజా, వీఎంసీ మహిళావిద్యాపీఠ్, డాక్టర్ వీఎస్ కృష్ణా, బుల్లయ్య, ప్రభుత్వ మహిళా కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చదువుతున్నారు. ఇక్కడ కేవలం ఐదు బాత్‌రూమ్‌లు మాత్రమే వుండడంతో కళాశాలలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు.
గదులు కూడా ఇరుగ్గా ఉండడంతో చదువుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వ వసతి గృహాలలో సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం, పోలీసులు లాఠీలకు పని చెప్పడం తెలిసిందే. అయినప్పటికీ బీసీ సంక్షేమశాఖ అధికారులు హాస్టల్ సమస్యలు పరిష్కరించిన పాపాన పోవడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అద్దెలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో భవన యజమానులు ఖాళీ చేయమంటున్నారని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. హాస్టల్‌లో చదువుకునే వాతావరణం లేకపోవడంతో మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. సొంత ఊరు, తల్లిదండ్రులకు దూరంగా వచ్చి అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో గదిలో 21 మంది పడుకోవలసిన పరిస్ధితి నెలకొంది.
దుస్తులు, బ్యాగులు ఉంచడానికి స్థలం లేక ఒక చిన్న గదిలో విద్యార్థినుల దుస్తులు ఉంచడంతో అక్కడ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్‌టీ, బీసీ విద్యార్థులకు అండగా ఉంటున్నామని చెబుతోంది. ఇక్కడ హాస్టల్స్‌లో ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పందించి సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.