అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు
మూడు నెలలుగా అందని రూ.12 కోట్ల బకాయిలు
కేంద్రాలను ఖాళీ చేయమంటున్న భవనాల యజమానులు
లబోదిబోమంటున్న కార్యకర్తలు
హైదరాబాద్: నిన్నటిదాకా వేతనాలు అందక నానా అవస్థలు పడిన అంగన్‌వాడీ కార్యకర్తల (వర్కర్ల)కు తాజాగా అద్దె కష్టాలు మొదలయ్యాయి. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలన్నింటికీ గత మూడు నెలలుగా సర్కారు అద్దె చెల్లించకపోవడంతో, ఆయా కేంద్రాలను ఖాళీ చేయాలంటూ భవనాల యజమానులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో అద్దె సొమ్ము రాక, భవన యజమానులకు సర్దిచెప్పలేక కార్యకర్తలు సతమతమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో యజమానుల ఒత్తిడి తట్టుకోలేక కార్యకర్తలే తమ వేతనాలను అద్దె బకాయిలకు జమ చేస్తున్నారు. మున్ముందు ఇదే కొనసాగితే ఏం చేయాలని వాపోతున్నారు.
మూడొంతులు అద్దె భవనాలే
సొంత భవనాలు లేకపోవడంతో సగానికి పైగా అంగన్‌వాడీ కేంద్రాలకు ఇక్కట్లు తప్పడం లేదు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,334 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 31,606 ప్రధాన కేంద్రాలు కాగా. మరో 3,728 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. మొత్తం 8,512 కేంద్రాలకే (24 శాతం) సొంత భవనాలు ఉండగా న్నాయి. మిగిలిన 76 శాతం కేంద్రాలకు అద్దె భవనాలే దిక్కయ్యాయి. 7,326 కేంద్రాలు వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన భవనాల్లో (తాత్కాలిక షెల్టర్) నడుస్తుండగా, 19,496 కేంద్రాలకు మాత్రం ప్రైవేటు భవనాలే దిక్కయ్యాయి. ఆయా ప్రాంతాలను బట్టి ఒక్కో కేంద్రానికి కనిష్టంగా రూ.750, గరిష్టంగా రూ.5,000 వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. వీటికి నెలకు సుమారుగా రూ.4 కోట్లు అద్దె ఉండగా, గత మూడు నెలల నుంచి చెల్లించకపోవడంతో బకాయిలు రూ.12 కోట్లకు చేరినట్లు తెలిసింది.
నేరుగా యజమానులకే చెల్లిస్తాం
అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్న భవనాల యజమానులకే నేరుగా అద్దె చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భవనాల యజమానులకు సంబంధించిన బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుల వివరాలను సేకరిస్తున్నందునే అద్దె చెల్లింపులో జాప్యం జరిగినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇదిలాఉంటే.. భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులు తమ బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని కొందరు కార్యకర్తలు వాపోతున్నారు. సర్కారు ఇవ్వకున్నా ఇప్పటివరకు తామే అద్దె చెల్లించినందున, గత మూడు నెలల బకాయిలను నేరుగా తమకే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.