మడకశిరలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం
మడకశిర: అంగన్ వాడీ కార్యకర్తలకు వేతన వెతలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,500 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు,హెల్పర్లకు ఐదు నెలలుగా జీతాలు అందలేదు. చిన్నపాటి సాంకేతిక లోపాన్ని ఎత్తి చూపుతూ నెలల తరబడి జీతాల చెల్లింపులో జాప్యం చేస్తూ వస్తున్నారు. లోపాన్ని సరిచేయడంలో సంబంధిత ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
17 ప్రాజెక్ట్‌లు..5,126 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 17 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 5,126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 5,126 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. ఇదే స్థాయిలో హెల్పర్లు కూడా ఉన్నారు. మడకశిర, హిందూపురం, కదిరిలో రెండు, కళ్యాణదుర్గం, కణేకల్లు, కంబదూరు, రాయదుర్గం, పెనుకొండ, ఉరవకొండ, గుత్తి, తాడిపత్రి, ధర్మవరం తదితర కేంద్రాల 50 నుంచి 100 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఐదు నెలలుగా జీతం అందలేదు.
ఐఎఫ్‌ఎస్‌సీ నమోదులో తప్పిదం
వివిధ బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్ కోడ్‌ల నమోదులో తేడా రావడమే జీతాల చెల్లింపులో జాప్యంగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు స్థానికంగానే ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేవారు. ప్రస్తుతం నేరుగా అమరావతిలోని ఐసీడీఎస్ కమిషనరేట్ నుంచి జీతాలను వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో తమకున్న ఖాతా నంబర్లను అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అందజేశారు. అయితే ఆయా బ్యాంకుల ఐఎఫ్‌ఎస్ కోడ్‌లను సరిగా నమోదు చేయకపోవడంతో కొన్ని మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఐదు నెలలుగా జీతాలు వారి ఖాతాల్లో జమ కాలేదు. ఈ చిన్న సాంకేతిక లోపాన్ని సరిచేయకుండా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లలో ఆవేదన వ్యక్తమవుతోంది.
అగళిలో సమస్య జటిలం
జిల్లాలోని అగళి మండలంలో 57 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, మరో 57 మంది హెల్పర్లు ఉన్నారు. వీరికి ఐదు నెలలుగా జీతాలు అంద లేదు. ఐఎఫ్‌ఎస్ కోడ్ నమోదులో వచ్చిన తేడా వలన ఈ పరిస్థితి ఏర్పడింది. మడకశిర నియోజకవర్గంలో 438 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 378 మంది హెల్పర్లు ఉన్నారు. వీరిలో అగళి మండలం వారికి మినహా మిగిలిన మండలాల వారందరికీ జీతాలు అందుతున్నాయి. దీంతో తామేమీపాపం చేసామంటూ అగళి మండలానికి చెందిన కార్యకర్తలు, సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపాన్ని సరి చేయాలంటూ అమరావతి కార్యాలయానికి పలుమార్లు స్థానిక ఐసీడీఎస్ అధికారులు వెళ్లి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రజా ప్రతినిధులు సైతం ఈ సమస్య తమది కాదు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో అంగన్‌వాడీల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి.
జీతాలు అందక ఇబ్బంది
ఐదు నెలలుగా జీతాలు అందలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. సాంకేతిక లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అయితే లోపాన్ని సరిచేయకుండా మా జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలి.– సర్వమంగళ, అంగన్‌వాడీ కార్యకర్త, అగళి
Comments
Please login to add a commentAdd a comment